వివాహ బంధంతో అత్తారింట్లో అడుగుపెట్టిన యువతి, తన భర్త వేధింపులు భరించలేకపోయింది.ఈ విషయాన్ని తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది.
కుటుంబం అన్నాక తరచూ ఏవో చిన్నచిన్న గొడవలు, మనస్పర్ధలు జరగడం సర్వసాధారణమే అంటూ తమ కుమార్తెకు తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో కొంతకాలం ఓపిక పట్టింది.భర్త ప్రవర్తనలో మార్పు కనిపించకపోవడంతో తాను అత్తారింట్లో ఉండలేనని, భర్తతో కాపురం చేయలేనని తన తల్లిదండ్రులకు తెగేసి చెప్పేసింది.
దీంతో ఆ యువతీ తండ్రి తీసుకున్న షాకింగ్ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

వివరాల్లోకెళితే.జార్ఖండ్ లోని( Jharkhand ) రాంచి నగరానికి చెందిన ప్రేమ్ గుప్తా( Prem Gupta ) అనే వ్యక్తి ఏప్రిల్ 2022లో తన కుమార్తె సాక్షి గుప్తాను సచిన్ కుమార్ అనే వ్యక్తికి ఇచ్చి తాహతకు తగ్గట్టుగా ఘనంగా వివాహం జరిపించాడు.వివాహం అయిన కొద్ది రోజులకే సచిన్ కుమార్( Sachin Kumar ) తన భార్య సాక్షి గుప్తాను వేధించడం మొదలుపెట్టాడు.అంతేకాదు సచిన్ కు అంతకుముందే మరో వివాహం కూడా అయినట్లు తెలిసింది.
ఈ విషయం సాక్షి గుప్తా( Sakshi Gupta ) తన తల్లిదండ్రులకు చెప్పింది.తల్లిదండ్రుల సూచనల మేరకు భర్త ఎంత వేధించిన కూడా కాపురం చేసింది.
అయితే భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అతనితో కలిసి ఉండలేనని తల్లిదండ్రులకు తెగేసి చెప్పేసింది.

తమ కుమార్తె సాక్షి గుప్తా నిర్ణయాన్ని ఆమె తల్లిదండ్రులు స్వాగతించారు.కుమార్తెను అత్తారింటి నుంచి పుట్టింటికి తీసుకువచ్చేందుకు చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు.మేళతాళాలతో, పటాసులు కాలుస్తూ, చాలా సందడి వాతావరణాన్ని నెలకొల్పి ఆమెను పుట్టింటికి తీసుకువచ్చారు.
అత్తారింట్లో కోడళ్ళకు వేధింపులు ఎక్కువైతే పుట్టింటి వారు అండగా ఉండాలని, కుమార్తె బాధ్యతలు తల్లిదండ్రులే చూసుకోవాలని ప్రేమ్ గుప్తా సూచించారు.సచిన్ తో తన కుమార్తె విడాకుల కోసం ప్రేమ్ గుప్తా న్యాయస్థానంలో కేసు వేశారు.
మేళ తాళాలతో అత్తారింటి నుండి పుట్టింటికి తీసుకువెళుతున్న వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది.పలువురు నెటిజన్స్ ప్రేమ్ గుప్తా తీసుకున్న నిర్ణయం పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.