పార్టీలో చోటు చేసుకుంటున్న కొన్ని కొన్ని సంఘటనలు టీడీపీ అధినేత చంద్రబాబు కు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి వైసీపీపై పోరాటం చేసే విషయంలో పార్టీ నేతల తీరు ఫర్వాలేదు అనిపిస్తున్నా… ఆ స్పీడ్ ఏ మాత్రం సరిపోదని ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న తరుణంలో ఆ స్పీడ్ మరింత పెంచాలి అని పదే పదే హెచ్చరికలు చేస్తున్నారు.
ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా, ముందు నుంచే ఎన్నికల కసరత్తు మొదలు పెట్టేశారు.ఎక్కడికక్కడ అభ్యర్థులను ప్రకటిస్తూ పార్టీని మరింత గా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
జిల్లాల వారీగా నియోజకవర్గాల వారిగా పార్టీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలను అంచనా వేస్తున్నారు.దానికి తగ్గట్లుగా తన నిర్ణయాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని అమలు చేస్తున్నారు.ఇప్పటికే 11 నియోజకవర్గాలకు సంబంధించి సమీక్షను పూర్తి చేశారు.
అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లను ఖరారు చేశారు.ఇక పార్టీ సీనియర్ నేతల వారసుల పొలిటికల్ ఎంట్రీ విషయం పైనా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించిన బాబు గుంటూరు, బాపట్ల జిల్లాలకు చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.టిడిపికి గట్టి పట్టు ఉన్న గుంటూరు జిల్లాలో నేతల మధ్య సమన్వయం లేదని, అధికార పార్టీ వైసీపీపై పోరాటం చేసే విషయంలో సమర్థవంతంగా వ్యవహరించలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.పార్టీ సీనియర్ నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చంద్రబాబు ఆచరించారు.
అధికార పార్టీ వైఫల్యాలను ఎండ కట్టడంలో విఫలమవుతున్నారంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీ ఇన్చార్జిలుగా ఉన్నవారు ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని తనకు ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రజలతో మమేకం కాకపోతే పార్టీనే నష్టపోతుందని హెచ్చరించారు.