తెలంగాణలో పోరు ఇక పూర్తిగా టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.టీఆరెస్‌కు సరైన ప్రత్యామ్నాయం మేమే అంటూ ప్రకటనలు చేస్తూ వస్తున్న బీజేపీ.
ఇప్పుడు అందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.నేరుగా కేసీఆర్‌పై యుద్ధానికి సిద్ధమవుతోంది.
దానికోసం తాజాగా ఓ బలమైన అస్త్రాన్ని ప్రయోగిస్తోంది.

అదే హిందుత్వ అస్త్రం.ఆ మధ్య యాదాద్రి స్తంభాలపై కేసీఆర్‌తోపాటు ప్రభుత్వ పథకాల చిత్రపటాలు చెక్కడాన్ని బీజేపీ పెద్ద ఇష్యూ చేసిన సంగతి తెలుసు కదా.ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే నేరుగా కేసీఆర్‌కే హెచ్చరికలు జారీ చేశారు.ఇక ఇప్పుడు పౌరసత్వ చట్ట సవరణ అంశాన్ని ఆయుధంగా మలచుకోవాలని బీజేపీ చూస్తోంది.
పార్లమెంట్‌లో ఈ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా టీఆరెస్ ఓటు వేసింది.
గత ఐదున్నరేళ్లుగా కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌కు అన్ని విధాలుగా టీఆరెస్ సాయం చేస్తూ వస్తోంది.బీజేపీ తీసుకొచ్చిన ప్రతి బిల్లుకూ మద్దతు తెలుపుతూ వచ్చింది.అయితే ఈ బిల్లు విషయంలో మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది.దీనికి కారణం తెలంగాణలో తన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ.

కేంద్రం కొత్తగా చేసిన సవరణ ప్రకారం దేశంలోకి అక్రమంగా వచ్చిన ముస్లిమేతరులకు మాత్రమే భారత పౌరసత్వం ఇస్తారు.దీనిని హైదరాబాద్ ఎంపీ అసద్ తీవ్రంగా వ్యతిరేకించారు.లోక్‌సభలో ఈ బిల్లు పత్రాలను చించేశారు.దీంతో తన మిత్రుడికి నచ్చని బిల్లుకు మద్దతు తెలపకూడదని టీఆరెస్ నిర్ణయించుకుంది.తెలంగాణలో తనకున్న ముస్లిం ఓటు బ్యాంకును మరింత పదిలం చేసుకోవడంలో భాగంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ఇక్కడే బీజేపీ మరోసారి తన హిందుత్వ అస్త్రాన్ని బయటకు తీసింది.
కేసీఆర్‌కు హిందువుల ఓట్లు అవసరం లేదా.వాళ్ల ఓట్లతో ఆయన గెలవలేదా అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నిస్తున్నారు.
టీఆరెస్‌ను ముస్లిం లీగ్‌లో కలపాలని అన్నారు.ఇదంతా చూస్తుంటే.
రానున్న రోజుల్లో కేసీఆర్‌పై కూడా ఈ హిందుత్వ అస్త్రాన్నే బలంగా ప్రయోగించి లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
కొసమెరుపు ఏంటంటే.
గతంలో ఇదే కేసీఆర్ ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు మద్దతు తెలిపారు.కానీ ఈ మూడు నెలల కాలంలోనే పరిస్థితులు మారిపోయినట్లు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో బీజేపీయే తనకు ప్రధాన ప్రత్యర్థి అని కేసీఆర్ భావిస్తున్నారా? ఇక నుంచి కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.