తెలంగాణ సీఎం కేసిఆర్ రాజకీయ వ్యూహాలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు.ఎవరికీ అంతుపట్టని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ తన ప్రత్యేకతను ఆయన చాటుకుంటూ ఉంటారు.
ప్రస్తుతం హుజురాబాద్ టెన్షన్ లో కేసిఆర్ ఉన్నారు.అక్కడ బలమైన నాయకుడిగా ఉన్న ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి తమకు గట్టిపోటీ ఇచ్చేలా కనిపిస్తుండటంతో ఆయనను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో కేసిఆర్ ఉన్నారు.
అందుకే సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.గతంలో కాంగ్రెస్ పేరు చెబితేనే మండిపడే కేసీఆర్, ఇప్పుడు మాత్రం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారికి ప్రాధాన్యం పెంచినట్టుగా కనిపిస్తున్నారు.
గతంలో అనేక సార్లు కాంగ్రెస్ నేతలు వివిధ సమస్యల విషయాన్ని ప్రస్తావించేందుకు కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినా, ఎప్పుడూ వారికి ప్రాధాన్యం దక్కలేదు.అసలు వారిని కలిసి ఉద్దేశమే లేదు అన్నట్లుగా కేసిఆర్ వ్యవహరించేవారు.
తెలంగాణలో కాంగ్రెస్ బలహీనం కావడానికి ప్రధాన పాత్ర పోషించారు.రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు.కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకుని ఎంత నష్టం చేయాలో అంత నష్టము చేశారు.అయితే ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో బిజెపి పట్టు పెంచుకుంటోంది.
కాంగ్రెస్ రోజురోజుకీ బలహీనమవుతున్న క్రమంలో ఆ పార్టీ ఓటు బ్యాంకు సైతం తమ ఖాతాలో వేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు.తాజాగా దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ వ్యవహారం కి సంబంధించి సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కు స్వయంగా ఫోన్ చేయించి మరి అపాయింట్ మెంట్ ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది.
స్వయంగా కేసీఆర్ బట్టి విక్రమార్క కి ఫోన్ చేసి ప్రగతి భవన్ కు రావాలని ఆహ్వానించినట్లు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది.
భట్టి, కేసీఆర్ మధ్య భేటీ జరిగిన తర్వాత మరియమ్మ కు సంబంధించి కేసీఆర్ సానుకూలంగా స్పందించారనే సంకేతాలను కాంగ్రెస్ శ్రేణులకు పంపించారు.ఏడేళ్ల కాలంలో కాంగ్రెస్ నేతలను కలిసేందుకు ఇష్టపడని కేసీఆర్ స్వయంగా అపాయింట్మెంట్ ఖరారు చేసి పిలిపించడం చూస్తుంటే , హుజురాబాద్ ఎఫెక్ట్ కారణంగానే కాంగ్రెస్ ను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.