‘నేను మత రాజకీయాలు చేయను’ అని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతుండగా, భాజపా నాయకులు, ప్రజాప్రతినిధులు మాత్రం వివాదాస్పద ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.కొందరు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారంటే…నరేంద్ర మోదీ ప్రధాని అయింది దేశాన్ని పరిపాలించడానికి కాదని, అయోధ్యలో రామమందిరం కట్టడానికేనని అంటున్నారు.
భాజపా నాయకుల వివాదాస్పద ప్రకటనలు మోదీకి ఇబ్బంది కలిగిస్తున్నా ఆయన ఏమీ మాట్లాడలేకపోతున్నారు.ఆర్ఎస్‌ఎస్ లక్ష్యం రామమందిరం నిర్మించడమే.
దానికి వ్యతిరేకంగా మోదీ ప్రకటన చేయలేరు.అందుకే కక్కలేక మింగలేక ఉన్నారు.
వివాదాస్పద ప్రకటనలు చేయడంలో పేరుమోసిన భాజపా ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి ఇబ్బంది కలిగించే ప్రకటన చేశారు.మోదీ హయాంలోనే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగితీరుతుందని బల్ల గుద్ది చెప్పారు.
దీంట్లో ఎలాంటి సందేహం లేదని కూడా అన్నారు.ఎన్‌డీఏ ప్రభుత్వం రామమందిర నిర్మాణంపై ముందుకే పోతుందన్నారు.‘ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఆ తరువాతి రోజు…ఎప్పడో ఒకప్పుడు రామమందిరం కట్టి తీరడం ఖాయం’ అని చెప్పారు.ఈ ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల సమయం ఉందన్నారు.
రామమందిరం నిర్మించకుంటే మోదీ అయినా ఇంటికి పోవల్సిందేనని మరో నాయకుడు వాఖ్యానించారు.రామమందిరం నిర్మించకపోతే మోదీ వచ్చే ఎన్నికల తరువాత (భాజపాకు మెజారిటీ వచ్చినా) మోదీ ప్రధాని కాకపోవచ్చేమో…! భాజపా నాయకుల వైఖరి చూస్తే అలాగే ఉంది మరి.