మడగాస్కర్‌లోని భారతీయ ప్రవాసుల కోసం ‘ఇండియన్ ధో’ అనే కేంద్రాన్ని భారత రాయబారి అభయ్ కుమార్, విజయన్ మడగాస్కర్ ఛైర్మన్ బౌజర్ బౌకాలతో కలిసి ఆ దేశ విదేశాంగ మంత్రి రిచర్డ్ రాండ్రియా మంట్రాడో అంటాననారివోలో ప్రారంభించారు.శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో మడగాస్కర్‌లోని భారతీయ ప్రవాసులు, రాయబారులు, దౌత్య సిబ్బంది, ఆ దేశ హస్తకళల మంత్రి సోఫీ రాట్సిరాకాతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బౌజర్ బౌకా మాట్లాడుతూ.మడగాస్కర్‌లో ఏదైనా నిర్మించాలనే ఆలోచన తనకు చాలా కాలం క్రితమే వుందన్నారు.
తనను ఈ విషయంలో ప్రోత్సహించిన భారత రాయబారి అభయ్ కుమార్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.భారత్ నుంచి మడగాస్కర్‌కు వలస వచ్చిన వారు, మడగాస్కర్ సమాజం, ఆర్ధిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న భారతీయ కుటుంబాల చరిత్రపై తమకు అవగాహన వుందని బౌజర్ అన్నారు.
కొత్తగా నిర్మించిన కేంద్రంలో యోగా, ఆయుర్వేదాలపై సెషన్‌లతో సహా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలనే ప్రణాళిక వుందని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా భారత రాయబారి అభయ్ కుమార్ మాట్లాడుతూ… గతేడాది మార్చి 27న మడగాస్కర్ ప్రధాని క్రిస్టియన్ ఎన్‌ట్సే భారత రాయబార కార్యాలయంలో ప్రారంభించిన ప్రత్యేక ప్రదర్శనను గుర్తుచేసుకున్నారు.
భారతీయ సమాజంలోని సభ్యుల సహకారంతో జీవం పోసుకున్న ఎగ్జిబిషన్‌కు ఈరోజు శాశ్వత స్థానం లభించిందని కుమార్ వ్యాఖ్యానించారు.మడగాస్కర్‌లోని భారతీయ ప్రజలు దేశంలోని సాంస్కృతిక, సామాజిక వైవిధ్యాన్ని సుసంపన్నం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు.
భారతీయ ప్రవాసుల కోసం ఒక కేంద్రం రూపుదిద్దుకోవడం గర్వంగా వుందన్నారు.
మడగాస్కర్ విదేశాంగ మంత్రి రిచర్డ్ రాండ్రియా మంట్రాడో మాట్లాడుతూ.ఈ కేంద్రం కేవలం భారతీయ ప్రవాసులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.భారత్‌తో సామాజిక , ఆర్ధిక సంబంధాలను పెంపొందించుకోవడం చాలా ముఖ్యమన్నారు.
భారతీయ డయాస్పోరా సభ్యులు … మడగాస్కర్- భారత్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి దోహదం చేస్తారని మంట్రాడో అన్నారు.అన్నట్లు ఈ కేంద్రంలో.
మడగాస్కర్‌కు వచ్చిన వివిధ భారతీయ కుటుంబాల చరిత్రపై ప్రదర్శన వుంటుంది.అలాగే భారత సంతతి వ్యక్తులకు సంబంధించి వివిధ కథనాలు, కళాఖండాలపై వీడియో ప్రదర్శనను నిర్వహిస్తారు.