సూర్యాపేట జిల్లా:నడినాలాను ఆక్రమించిన ఘనుడు.సమాచారం ఇచ్చినా పట్టించుకోని మున్సిపల్ అధికారులు.
వర్షాకాలంలో పేటకు మళ్ళీ ముంచుకొస్తున్న వరద ముప్పు.మరోసారి భయం గుప్పెట్లో మానస నగర్.
మంత్రి ఆదేశాలు బేఖాతర్.
అతనొక ప్రభుత్వ ఉపాధ్యాయుడు.
చెప్పేది నీతి పాఠాలు చేసేవి అవినీతి,ఆక్రమణ పనులు.జిల్లా కేంద్రంలోని 60 సంవత్సరాల నుండి చౌదరి చెరువుకు వరదనీరు పోయే నాలా కాలువను ఆక్రమించిన ఘనత ఇతనికే దక్కుతుంది.
తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా నాలా పైనుంచి కింది వరకు ఆక్రమణలకు గురై,గత మూడేళ్ల నుండి చిన్నపాటి వర్షానికే వరద నీరు నడి కాలనీలోకి వచ్చి చేరి సామాన్య,పేద మధ్యతరగతి ప్రజలను చిన్నాభిన్నం చేస్తున్న జల దృశ్యం సంగతి తెలిసిందే.గతేడాది వర్షాకాలం కురిసిన వర్షాలకు సూర్యాపేట పట్టణం జలదిగ్భంధనంలో చిక్కుకుని ప్రజలు విలవిల్లాడిన దృశ్యాలు ఇంకా కళ్ళ ముందు నుండి తొలగిపోనేలేదు.
పేట పరిస్థితికి కారణం నాలాల ఆక్రమణలే అని తేలడంతో జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నాలాల ఆక్రమణపై సీరియస్ అయ్యారు.ఏ స్థాయి వారు ఆక్రమించినా నిర్దాక్షిణ్యంగా తొలగించి,చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి ఆదేశాలతో దిద్దుబాటు చర్యలకు దిగిన మున్సిపల్ అధికారులు కొద్ది రోజులు హడావుడి చేసి,కొన్ని ఆక్రమిత నాలాలను తొలగించారు.తర్వాత అంతా యధా మామూలే అయ్యింది.
ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చింది.గతేడాది వర్షాలకు పూర్తిస్థాయిలో నీటిలో మునిగి అల్లాడిన మానస నగర్ కు మళ్ళీ కష్టాలు తప్పేలా లేవు.
మానస నగర్ లో నడి నాలాను ఆక్రమించి,అందులో అక్రమ నిర్మాణం చేయడానికి సకలం సమకూర్చుకుంటున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి భూ భాగోతం కళ్ళ ముందు కనిపిస్తున్నా,మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా మొద్దునిద్ర నటిస్తుండడంతో మళ్ళీ మానస నగర్ ప్రజలు చినుకు పడితే చాలు చిగురుటాకులా వణికిపోతున్నారు.
పోయినేడు ఏం జరిగింది?60 సంవత్సరాల పైబడి నాలా కబ్జాకు గురి కావడంతో గత జనవరి మాసంలో కురిసిన వర్షాలకు సూర్యాపేట పట్టణం మొత్తం నీట మునిగి చెరువును తలపించి అతలాకుతులమైంది.దీనిలో భాగంగా మానస నగర్ కూడా నాలా ఆక్రమణ గురై వర్ష బీభత్సానికి చిన్నాభిన్నమైంది.పరిస్థితి తీవ్రతను పసిగట్టిన సూర్యాపేట శాసనసభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అధికారులతో కలసి మానస నగర్ ను సందర్శించి,నాలా కాలువను పరిశీలించి ఆక్రమణలకు గురిందని తెలుసుకొని నాలా పరిధిలోకి వచ్చే స్థలాలను ఆక్రమించుకున్న వారు ఎంతటి వారైనా వారి కట్టడాలు కూల్చాల్సిందిగా అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా అధికారులు నాలా వెడల్పు కానీ,అక్రమ కట్టడాలు కానీ,కూల్చి వేయలేదు.మూడు శాఖల పరిధిలో ఉన్న నాలా ఇంతవరకు స్థిరమైన మార్కింగ్ లేక నాలా పరిధి నిర్మాణం చేపట్టక అక్రమార్కులకు వరమైంది.
వెనువెంటనే మంత్రి ఆదేశాలు అమలుపరిచి స్థిరమైన నాలా కట్టడం నిర్మిస్తే ప్రస్తుతం ఆక్రమణలు జరిగి ఉండేవి కావని మానస నగర్ కాలనీవాసులు వాపోతున్నారు.మంత్రి ఆదేశాలకు విలువ లేకుండా పోవడంతో,ప్రస్తుతం వర్షాబావ పరిస్థితి దృష్ట్యా ఏ చిన్న చినుకుబడిన కాలనీవాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటే అతిశక్తి కాదేమో! వచ్చే ఉపద్రవం ఉధృతంగా ముంచి వేయక ముందే మున్సిపల్ అధికారులు మేలుకోకపోతే భారీ నష్టం చవిచూసే అవకాశం లేకపోలేదు.
ఇప్పటికైనా నాలా కాలువను ఆక్రమించి మట్టిపోసి ఫ్లాట్ చేసుకున్న భూముల మట్టితవ్వి వరదనీరు సాఫీగా ప్రవహించి చౌదరి చెరువులోకి నీటిని చేరవేసే చర్యలు చేపట్టాలని,మరోసారి అభాసుపాలు కాకముందే అధికారులు కళ్ళు తెరవాలని మానస నగర్ కాలనీవాసులు కోరుతున్నారు.
అధికారులకు సమాచారం ఇచ్చిన స్పందన లేదు.
ఇదిలా ఉంటే గత నెల రోజుల క్రితమే మానస నగర్ కాలనీవాసులు నాలా ఆక్రమణకు గురవుతుందని,ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాలాలో మట్టి పోసి ఫ్లాట్ గా మార్చుకున్నాడని సమాచారం ఇచ్చారు.కానీ, సంబంధిత మున్సిపల్ అధికారులు ఇంతవరకు అటుగా వెళ్లి పరిశీలన జరపలేదని కాలనీవాసులు తెలుపుతున్నారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మున్సిపల్ అధికారుల తీరు ఉందని, ఇలాంటి వారితో మంత్రికి చెడ్డ పేరు వస్తుందని వారు వాపోతున్నారు.కిందిస్థాయి అధికారులు సకాలంలో స్పందిస్తే మునుముందు తమకు ముప్పు తప్పుతుందని అంటున్నారు.
ఏది ఏమైనా అధికారుల అలసత్వం మానస నగర్ కాలనీ వాసులకు శాపంగా మారే అవకాశం ఉందనేది పట్టణ ప్రజలు మాటగా వినిపిస్తుంది.ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి నాలా ఆక్రమణ గురికాకుండా చూస్తారా లేదా చూడాలి మరి!
.