దేశంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో మనందరికీ తెలిసిందే.గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా 70 వేలకు పైగా కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.
కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొందరు ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. శరీరంలోని అన్ని అవయవాలతో పోలిస్తే ఊపిరితిత్తులపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే.
కొందరు వైద్యులు కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా వైరస్ ప్రభావం ఊపిరితిత్తులపై ఉంటుందని… ఊపిరితిత్తులు సాధారణ స్థితికి చేరుకోవడం సాధ్యం కాదని తెలిపారు.అయితే తాజా అధ్యయనంలో వైద్యులు పరిశోధనలు చేసి ఊపిరితిత్తుల గురించి కీలక విషయాలను వెల్లడించారు.
ఆస్ట్రియా పరిశోధకులు వైరస్ నుంచి రోగులు కోలుకున్న కొన్ని వారాల తరువాత ఊపిరితిత్తులు సాధారణ స్థితికి వస్తున్నట్టు గుర్తించామని తెలిపారు.
కరోనా వైరస్ నుంచి కోలుకున్న 82 మందిపై కార్డియో పల్మనరీకి జరిగిన నష్టం గురించి పరిశోధనలు జరిపి కొందరు రోగుల్లో ఆరు వారాల తరువాత, కొందరు రోగుల్లో 12 వారాల తర్వాత ఊపిరితిత్తులు సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు గుర్తించామని తెలిపారు.
వైద్య సహాయం తీసుకున్న వాళ్లలో ఊపిరితిత్తులు మరింత వేగవంతంగా రికవరీ అవుతున్నాయని… చికిత్స అందించకపోయినా కొందరు రోగుల్లో ఊపిరితిత్తులు కొన్ని వారాల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని అన్నారు.
కరోనా రోగుల మానసిక స్థితిని, కండరాల బలం, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని బట్టి ఊపిరితిత్తులు సాధారణ స్థితికి చేరుకోవడంలో మార్పులు ఉంటాయని వైద్యులు తెలిపారు.
సహజ రోగ నిరోధక శక్తి ద్వారా చాలామంది తక్కువ సమయంలోనే కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.మరోవైపు కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరి కొంత సమయం పట్టేలా ఉంది.
ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఫెయిల్ కావడం గమనార్హం.