నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ప్రధాన సమస్యగా మారిందని, డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,మల్టీ జోన్ 2 ఐజిపి సత్యనారాయణ పిలుపునిచ్చారు.బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్ నందు జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన “మిషన్ పరివర్తన్” కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి వారు హాజరై అందరితో మేము డ్రగ్స్ వాడమంటూ ప్రతిజ్ఞ చేయించారు.ఈసందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.నల్లగొండ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలని, యువత ఈ మహమ్మారి బారినపడి బానిసలుగా మారుతున్నారన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మహమ్మారిపై ప్రత్యేక శ్రద్ధతో డ్రగ్స్ రహిత తెలంగాణగా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారని,రాష్ట్రంలోకి అక్రమంగా వస్తున్న డ్రగ్స్ ను అరికట్టడంలో తెలంగాణ పోలీస్ శాఖ ముందుండి పోరాడుతుందని,అందులో భాగంగానే మిషన్ పరివర్తన కార్యక్రమం ఏర్పాటు చేసి యువతకు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు చేస్తున్నారని చెప్పారు.మిషన్ పరివర్తన్ తో కొందరు యువకులు మారుతున్నారని, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని సూచించారు.
అనంతరం మల్టి జోన్ 2 ఐజిపి సత్యనారాయణ మాట్లాడుతూ…నేటి సమాజంలో పెను సవాలుగా మారిన మాదకద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మాదకద్రవ్య రహిత తెలంగాణ ఏర్పాటు కొరకు పోలీసులు గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టారని తెలిపారు.
యువత మత్తు పదార్థాల బారిన పడడం వల్ల వారి బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
మాదకద్రవ్యాలు సేవించే వారిని యూరిన్ టెస్ట్ ద్వారా గుర్తిస్తూ మత్తు పదార్థాలు,మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఉండే దిశగా అనేక కార్యక్రమాల ద్వారా యువకులకు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.మాదక ద్రవ్య రహిత నల్గొండ జిల్లాగా ఏర్పాటు చేయడం కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పిడిఎస్ రైస్ పై కూడా ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయని,వాటిపై కూడా ప్రత్యేకమైన టీం లను ఏర్పాటు చేసి వాటిని కూడా అరికడతామన్నారు.ఎవరైనా మాదకద్రవ్యాలు సేవిస్తున్నట్లు సమాచారం అందితే టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం అందజేసి బాధ్యతగల పౌరుడిగా సేవలందించాలని కోరారు.