కర్బూజ, పుచ్చకాయ పంటలకు తెగుళ్ల బెడద విపరీతంగా ఉంటుంది.పంటలు వేశాక తెగుళ్లు ఏమైనా వచ్చాయా అని నిరంతరం గమనిస్తూనే ఉండాలి.
కాస్త తెగుళ్లు వచ్చాయని అనుమానం వస్తే వెంటనే కొన్ని సస్యరక్షణ పద్ధతులు పాటించి పంటను సంరక్షించుకోవాలి.ఈ పంటలకు తెగులు సోకడానికి ప్రధాన కారణాలలో వాతావరణం కూడా ప్రభావితం చేస్తోంది.
వాతావరణం లోని పరిస్థితుల కారణంగా కాయలపై జిగురు అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది.కాబట్టి పంటను నిరంతరం గమనిస్తూ ఉండాలి.
వాతావరణం లోని పరిస్థితుల కారణంగా మొక్క ఆకులపై మచ్చలు ఏర్పడతాయి.అవి క్రమేణ తీగలు, కాయలపై ప్రభావం చూపుతాయి.
వీటిని బ్యాక్టీరియా మచ్చ తెగులు అంటారు.వీటి నివారణ కోసం ఒక లీటరు నీటిలో కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు కలిపి వారంలో రెండుసార్లు పిచికారి చేయాలి.
ఇక చెట్ల తీగలపై, ఆకులపై, కాండంపై బూడిద వంటి పదార్థం కప్పబడి ఉన్నట్లయితే దానిని బూడిద రంగు తెగులు అంటారు.మొదట బూడిద రంగులో ఉండి తర్వాత పసుపు రంగులోకి మారి, గిడసబారి పోయి వీటి ప్రభావం వల్ల పూత సరిగా రాకపోవడం, ఆకుల కాండం ఎండి కాయల సైజు తగ్గడం జరుగుతుంది.బూడిద రంగు తెగులు సోకిన మొక్కలను పంట నుండి వేరు చేసి కాల్చివేయాలి.తర్వాత పంటకు ఒక లీటర్ నీటిలో ఇండోఫిల్ ఎం-45 ను 2.5 గ్రాములు కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.వాతావరణంలో తేమశాతం పెరిగినప్పుడు ఆకు అడుగు బాగాన ఉదర రంగు మచ్చలు ఏర్పడి అందులో బూజులాగా ఏర్పడితే వాటిని బూజుతెగులు అంటారు.
దీనివల్ల కాయలు తొందరగా పక్వానికి రావు.నివారణ కోసం రెండు గ్రాముల మాంకోబెజ్ ను లీటర్ నీటిలో కలుపుకొని వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.మొక్క పూర్తిగా పసుపు వర్ణంలోకి మారి, ఆకులపై బుడిపెలు ఏర్పడి, గిడసబారిపోతే వాటిని వైరస్ తెగులు అంటారు.ఒక లీటరు నీటిలో రెండు మిల్లి లీటర్ల డైమిథోయేట్ కలిపి పిచికారి చేయాలి.
భూమిలో తేమ అధికంగా ఉంటే, శిలీంద్రాల ద్వారా కాయకుళ్ళు తెగులు ఏర్పడి కాయపై తెల్లని బూజు వస్తుంది.వీటి నివారణకు లీటర్ నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి మొక్క మొత్తం పాదులతో సహా తడిచేలా వారానికి రెండుసార్లు పిచికారి చేయాలి.