పవిత్రమైన మాసాలలో కార్తీకమాసం ఒకటి.ఇంతటి పవిత్రమైన కార్తీక మాసాలలో శివుడికి, విష్ణువుకు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
అంతేకాకుండా ఈ నెలలో దేవతా వృక్షాలైన తులసి,ఉసిరి చెట్లకు ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తారు.ఇంతటి పవిత్రమైన ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఎంతో శ్రేష్టమైనది.
ఇంతటి శ్రేష్టమైన రోజు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని మహాశివరాత్రి లాగా భావిస్తారు.
ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆ పరమేశ్వరుడు త్రిపురాసుర అనే రాక్షసుణ్ణి సంహరించడం వల్ల వెయ్యేళ్ల రాక్షస పాలనఅంతం అయ్యిందన్న ఆనందంలో పరమశివుడు తాండవం చేయడంవల్ల కార్తీక పౌర్ణమిని మహాశివరాత్రి తో సమానంగా భావిస్తారు.
ఇంతటి పవిత్రమైన రోజు న దీపం వెలిగిస్తే సర్వపాపాలు తొలగిపోయి, కోటి జన్మల పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

ఈ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శివాలయాలలో రోజుకోక దీపం చొప్పున 365 ఓత్తులను వెలిగించడం ద్వారా సంవత్సరం మొత్తం పూజలు చేసిన ఫలితం లభిస్తుంది.అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు.ఈ వ్రతాన్ని ఆచరించేవారు మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా అలంకరించి, మర్రి కాయలను బూరెలుగా చేసి, ఆకులను విస్తర్లుగా పెట్టి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భార్య భర్తల మధ్య ఎటువంటి అపోహలు లేకుండా వారి బంధం బలపడుతుందని విశ్వాసం.
కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్ష చేసి సాయంత్రం కృత్తికా దీపోత్సవం నిర్వహించి, ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసి దీపారాధన చేస్తారు.అంతే కాకుండా ఈ పౌర్ణమినాడు ఆవు నెయ్యితో దీపం వెలిగించి, నదులలో వదిలి చంద్రుని దర్శనం చేసుకోవడం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.