బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను పార్టీ గేట్ వివాదం నీడలా వెంటాడుతోంది.పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పినప్పటికీ ఆయనపై జనానికి పీకల్లోతు కోపం వుంది.
కోవిడ్ సమయంలో తమను ఆంక్షల చట్రంలో బంధించి.ప్రధాని అండ్ కో విందులు , వినోదాల్లో మునిగితేలారని ప్రజలు మండిపడుతున్నారు.
తాజాగా క్వీన్ ఎలిజబెత్ -2 ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని బోరిస్ జాన్సన్‌కు చేదు అనుభవం ఎదురైంది.క్వీన్‌కు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రధాని తన భార్య క్యారీతో కలిసి లండన్‌లోని సెయింట్ పాల్స్ కేథడ్రల్‌కు వెళ్లారు.
అయితే ఈ వేడుకలకు హాజరైన ప్రజల్లో కొందరు ప్రధానిని చూసి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ హేళనగా మాట్లాడారు.కానీ కొందరు మాత్రం బోరిస్ జాన్సన్‌కు చప్పట్లతో స్వాగతం పలికారు.
కాగా.కరోనా ఫస్ట్‌వేవ్ ఉద్ధృతంగా వున్న వేళ.ప్రపంచంలోని అన్ని దేశాలు కఠిన నిబంధనల్ని అమలు చేయాలని, లాక్డౌన్ విధించాలని నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించాయి.సరిగ్గా బ్రిటన్‌లో కరోనా కేసులు పెరుగుతున్న 2020 జూన్‌లో జాన్సన్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని అధికార నివాసమైన 10-డౌనింగ్ స్ట్రీట్‌లో పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు.
ఆ పార్టీలో జాన్సన్ సహా ఉన్నతాధికారులు నిబంధనల్ని ఉల్లంఘించి పాల్గొన్నారు.
దీంతో ఆయన వైఖరిపై సొంత పార్టీ నేతలతో పాటు విపక్షాలు దుమ్మెత్తిపోశాయి.
తద్వారా అధికారంలో ఉంటూ చట్టాన్ని ఉల్లంఘించిన తొలి ప్రధానిగా బోరిస్ జాన్సన్ అప్రతిష్టను మూటగట్టుకున్నారు.నిబంధనలు అతిక్రమించి పార్టీలో పాల్గొన్నందుకుగాను ఆయనకు 50 పౌండ్ల (భారత కరెన్సీలో రూ.5వేలు) జరిమానాను పోలీసులు విధించారు.అయితే తన పుట్టినరోజు వేడుకలతో పాటు కరోనా సమయంలోనే ప్రభుత్వ భవనాల్లో జరిగిన మరికొన్ని పార్టీలకూ బోరిస్ జాన్సన్ హాజరయ్యారన్న ఆరోపణలపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన స్యూ గ్రే కమిషన్ తన నివేదికను సమర్పించింది.ఇందులో ప్రభుత్వ పెద్దలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.ఈ విందు , వినోదాలకు సీనియర్ నాయకత్వమే బాధ్యత వహించాలని నివేదికలో స్పష్టం చేసింది.
అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఈ వివాదంపై బోరిస్ జాన్సన్ ఎట్టకేలకు దిగొచ్చారు.లాక్డౌన్ నిబంధనల్ని అతిక్రమించినందుకు గాను ఏప్రిల్‌లో క్షమాపణలు తెలియజేశారు.పుట్టిన రోజున కేక్ కట్ చేయడం కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందన్న విషయం తనకు తోచలేదని జాన్సన్ వివరణ ఇచ్చారు.
అయితే, విపక్షాలు కోరుతున్నట్లుగా తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని బోరిస్ కుండబద్ధలు కొట్టారు.