చాలా ఏళ్ల తర్వాత అమెరికా మార్కెట్లలో కనిపించిన భారతీయ మామిడి పండ్లు ఇరు దేశాల మధ్య స్నేహానికి చిహ్నమన్నారు అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు. ఇది ద్వైపాక్షిక భాగస్వామ్యంలో బలం, దృఢత్వం, పరిపక్వతకు ప్రతిబింబమని ఆయన అభిప్రాయపడ్డారు.5000 ఏళ్లకు ముందు నుంచి భారత్‌లో మామిడి పండు పండుతోందని.ప్రపంచంలోని మొత్తం మామిడిలో 40 శాతానికి పైగా ఇండియానే ఉత్పత్తి చేస్తోందని తరంజిత్ తెలిపారు.
ప్రపంచంలోనే పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వున్న సన్నిహిత సంబంధాలను మామిడి ప్రతిబింబిస్తుందన్నారు.ఈ మేరకు గురువారం వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సంధు వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వారికి తాజా మామిడి పండ్ల ముక్కలతో పాటు మ్యాంగో లస్సీని తరంజిత్ వారికి అందజేశారు. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ సహా ఇరు దేశ ప్రభుత్వాలు, అధికారుల చొరవ లేకుండా భారత మామిడి పండ్లు ఈ రోజు ఇక్కడ వుండేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇరు దేశాల మధ్య ఆర్ధిక, వాణిజ్య భాగస్వామ్యం, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు సంధు చెప్పారు.
కాగా.గతేడాది చివరిలో భారత్–అమెరికా ట్రేడ్ పాలసీ ఫోరం (టీపీఎఫ్) 12వ మంత్రుల స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఇరు దేశాలు ఎగుమతి, దిగుమతుల పరిధిలోకి మరిన్ని ఉత్పత్తులను చేర్చడంపై దృష్టి సారించాయి.
ఇందులో భాగంగానే భారత్ నుంచి అమెరికాకు మామిడి, దానిమ్మ ఎగుమతి చేయడానికి, అక్కడి నుంచి చెర్రీ పళ్లను దిగుమతి చేసుకోవడానికి వీలు కుదిరింది.ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అమెరికా ట్రేడ్ రిప్రెజెంటేటివ్ (యూఎస్టీఆర్) కేథరిన్ టై అంగీకరించారు.
ఈ ఆర్ధిక సంవత్సరంలో భారత్- అమెరికాల మధ్య వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని గోయల్, కేథరిన్ అభిప్రాయపడ్డారు.వాణిజ్యానికి అడ్డంకులను తొలగించేందుకు మరిన్ని అంశాలపై కలిసి పనిచేయాలని ఇద్దరూ తీర్మానించారు.
అటు, దేశీ ఎగుమతిదారులకు ప్రాధాన్య హోదా (జీఎస్‌పీ) ప్రయోజనాలను పునరుద్ధరించాలని ఈ సమావేశంలో అమెరికాను భారత్ కోరింది.దీన్ని పరిశీలిస్తామంటూ అమెరికా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.