అమెరికాలో హనుమాన్ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు అమెరికన్స్.భక్తి శ్రద్దలతో, హనుమాన్ చాలీసా పారాయణంతో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగి పోయింది.
అయితే ఆ గుడిలో భజన పాటలు, హానుమాన్ చాలీసా, ఇలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నా సరే అమెరికన్స్ మాత్రమే ప్రధాన పాత్ర పోషిస్తారు, భారతీయ ఎన్నారైలు మాత్రం వారికి సహాయ సహకారాలు అందిస్తారు.అదేంటి విదేశాలలో ఎక్కడైనా సరే భారత ఎన్నారైలు ఆలయాల నిర్వహణ చేపడితే విదేశీయులు సహకారం అందిస్తారు కదా ఇక్కడేంటి రివర్స్ లో జరుగుతోంది అనుకుంటున్నారా.
అమెరికాలో న్యూ మెక్సికో రాష్ట్రంలోని టావోస్ లో హనుమాన్ ఆలయం ఉంది.చుట్టూ మంచు పర్వతాలు, ఆలయానికి దగ్గరగా ప్రవహించే రియోగ్రాండ్ నది, రోజు హనుమాన్ చాలీసా పారాయణంతో ఆ ప్రాంతం మారుమోగిపోతుంది.
ఈ ఆలయాన్ని అమెరికన్స్ నిర్మించుకున్నారు.అమెరికన్స్ అమెరికాలో హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి కారణం ఏంటంటే.
భారత్ లో ఎన్నో హనుమాన్ ఆలయాలు నిర్మించిన శ్రీ నీమ్ కరోలి బాబా మహారాజ్ కు అమెరికాలో హనుమాన్ ఆలయం నిర్మించాలని కోరిక ఉండేది అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన కాలం చేయడంతో ఆయన శిష్యులు అమెరికన్స్ తో కలిసి అమెరికాలో ఆలయ నిర్మాణం చేపట్టారు.
అమెరికాలో ఉండే బాబా భక్తుడు ఆలయ నిర్మాణం కోసం స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు.
ఎలాంటి విగ్రహం ప్రతిష్టించాలని ఆలోచిస్తున్న సమయంలో గాలిలో పయనిస్తూ సీత కోసం వెతికే హనుమాన్ విగ్రహం తయారు చేయించి ఆలయంలో ప్రతిష్టించారు.క్రమ క్రమంగా ఆలయానికి భారతీయ ఎన్నారైలు రావడంతో పాటు అమెరికన్స్ కూడా పెద్ద మొత్తంలో రావడంతో ఈ ఆలయానికి ప్రాముఖ్యత పెరిగింది.
నిత్యం హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు ప్రసాదాలు అందించడం నిత్యం పూజలు చేయడం, నిర్వహణలను అమెరికన్స్ దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారు.ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా సరే అమెరికన్స్ కు భారతీయ ఎన్నారైలు సహాయసహకారాలు అందిస్తుంటారు.