శ్రీమహావిష్ణువుకు బుధవారం అంటే ఎంతో ప్రీతికరమైన రోజు.కనుక బుధవారం సాయంత్రం విష్ణు ఆలయాన్ని దర్శించటం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
మహా విష్ణువు స్థితికారకుడు కనుక మన జీవితంలో ఏర్పడిన సమస్యలన్నింటినీ తొలగిస్తాడు.విష్ణువుతో పాటు పరమేశ్వరుని ఆలయాన్ని కూడా దర్శించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
పరమ శివుడు లయకారకుడు కనుక శివాలయాన్ని సంధ్యాసమయంలో దర్శించటం వల్ల రెట్టింపు ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
అదేవిధంగా బుధవారం తులసి మాత పూజ విశేష ఫలితాలను కలిగిస్తుంది.
బుధవారం ఉదయం తలంటు స్నానం చేసి ఎటువంటి ఆహార పదార్థాలు సేవించకుండా ఉపవాసంతో తులసి పూజ చేసి అనంతరం తులసి ఆకుల తీర్థాన్ని సేవించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.ఇటు ఆధ్యాత్మికపరంగాను, ఆరోగ్య పరంగాను తులసి ఎంతో ప్రయోజనకరమని పండితులు తెలియజేస్తున్నారు.
బుధవారం బుధగ్రహనికి ఎంతో అనువైన రోజు కనుక ఈ బుధవారం రోజు బుద్ధుడిని దర్శించుకోవడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు.బుధగ్రహానికి అభిషేకం నిర్వహించి పెసరపప్పును నైవేద్యంగా సమర్పించడం వల్ల బుధ అనుగ్రహాన్ని పొందగలము.అదేవిధంగా సాయంత్ర సమయంలో తులసికోట ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శుభ ఫలితాలను కలిగిస్తుంది.విష్ణు ఆలయాన్ని సందర్శించినప్పుడు తులసి మాలతో స్వామివారికి పూజలు చేసి, నువ్వుల దీపం వెలిగించడం ద్వారా జీవితంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోవడమే కాకుండా,ఆర్థిక సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలను కలిగిస్తుంది.
ఆ మహావిష్ణువు కొలువై ఉన్న రావి చెట్టును కూడా బుధవారం పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.సాయంత్ర సమయంలో రావిచెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షణలు చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
DEVOTIONAL