కొత్త ఏడాదిలోకి మరికొన్ని గంటల్లో అడుగుపెట్టబోతున్నాం.2020 ఏడాదిలో కరోనా జ్ఞాపకాల నుంచి బయటపడబోతున్నాం.కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి అంతా సిద్ధమవుతున్నాం.తెలుగు చలన చిత్ర పరిశ్రమ సైతం కొంగొత్త ఆశలతో 2021 ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నది.కరోనా కారణంగా 2020 ఏడాదంతా చలన చిత్ర పరిశ్రమకు చేదు జ్ఞాపకంగానే మిగిలిపోయింది.ఎన్నో సినిమాలు విడుదలకు నోచుకోలేక చిత్ర పరిశ్రమ గడ్డుపరిస్థితిని ఎదుర్కొన్నది.
షూటింగ్‌లు సైతం నెలల తరబడిగా నిలిచిపోయిన సంఘటనలు మనకు తెలిసిందే.
ఎట్టకేలకు సినిమాల విడుదల జరుగుతోంది.
కొత్త ఏడాది ప్రారంభంలో విడుదలకు సినిమాలు క్యూలో సిద్ధంగా ఉన్నాయి.అయితే జనవరి 1వ తేదీన విడుదల కాబోతున్న ఆ రెండు సినిమాలపైనే అందరి దృష్టి ఉంది.
మరీ ముఖ్యంగా పరిశ్రమ వర్గాలది.జనవరి 1న నాచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు నటించిన “వి” సినిమాపై, అలాగే యంగ్ హీరో రాజ్‌తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమాపైనే ఆతరువాత విడుదల కాబోయే మిగతా సినిమాల భవితవ్యం ఆధారపడి ఉంది.
ఎందుకంటే ఈ రెండు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయినవి.స్ట్రీమింగ్ అయిన తరువాత కూడా థియేటర్లలో జనవరి ఫస్ట్ నాడు విడుదల కాబోతున్నాయి.కరోనా కారణంగా సుమారు ఓ 50 వరకు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి.స్ట్రీమింగ్ అయిన సినిమాల్లో వీ, ఓరేయ్ బుజ్జిగా సినిమాలు మళ్లీ థియేటర్లలో రిలీజై తమ అదృష్టాన్ని పరిష్కరించుకొబోతున్నాయి.
ఈ రెండు సినిమాలను థియేటర్లలో ప్రేక్షకులు ఆదరిస్తే మాత్రం ఇప్పటికే ఓటీటీలో విడుదలైన డబ్బింగ్, స్ట్రైట్ సినిమాలు అన్నీ కూడా విడుదలకు క్యూ కట్టనున్నాయి.ఒకవేళ ఫలితాలు తారుమారైతే ఇక అంతే సంగతులు.
అంటే థియేటర్లలో కొత్త ఏడాదిలో విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాలపైనే మిగతా సినిమాల భవితవ్యం ఆధారపడి ఉందనేది సినీవర్గాల వాదనగా వినిపిస్తోంది.
వి, ఒరేయ్ బుజ్జిగా సినిమాలతో పాటు మరో నాలుగు సినిమాలు కూడా జనవరి 1వ తేదీన థియేటర్లలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి.
అందులో చిత్రం ఎక్స్, తెరవెనుక, కాళిక, షకీలా చిత్రాలు ఉన్నాయి.