ఇంటర్నెట్ ఇప్పుడు ఒక వీడియోతో షేక్ అయిపోతోంది.పాలరాతి శిల్పాన్ని చెక్కుతున్న ఒక రోబో( Robot ) వీడియో వైరల్ కావడంతో జనాలు షాక్ అవుతున్నారు, బాధపడుతున్నారు.
టెక్నాలజీని అభిమానించే వాళ్లు మాత్రం ఈ అద్భుతమైన యంత్రాన్ని చూసి మురిసిపోతున్నారు.మరోవైపు కొందరు కళాకారులు, కళను ప్రేమించేవాళ్లు మాత్రం భవిష్యత్తులో సృజనాత్మకతకు విలువ ఉంటుందా? అని కంగారు పడిపోతున్నారు.మార్చి 21న ‘మోన్యుమెంటల్ ల్యాబ్స్’ ( Monumental Labs )అనే కంపెనీ ఇన్‌స్టాలో ఒక వీడియో పోస్ట్ చేసింది.అందులో ఒక రోబో పాలరాతి శిల్పాన్ని అద్భుతంగా చెక్కుతోంది.
ఆ శిల్పం పేరు సెయింట్ జోసెఫ్( Saint Joseph ) అంట.రోబో చాలా జాగ్రత్తగా పాలరాతిని చెక్కుతూ, ఉపరితలం నునుపుగా ఉండటం కోసం నీటిని కూడా స్ప్రే చేస్తోంది.మోన్యుమెంటల్ ల్యాబ్స్ ఇలాంటి AI సహాయంతో చేసిన శిల్పాలకు సంబంధించిన వీడియోలను చాలానే పోస్ట్ చేసింది.
అయితే నెటిజన్లు మాత్రం ఈ వీడియోపై చాలా నెగెటివ్ గా స్పందించారు.
చాలామంది చూసినవాళ్లంతా నిరాశతో, కోపంతో కామెంట్లు పెడుతున్నారు.ఒక యూజర్ ఏకంగా “ఇప్పుడు రోబోలు శిల్పాలు కూడా చెక్కుతున్నాయా, నెక్స్ట్ ఏంటి? వాటికి భావోద్వేగాలు ఉంటాయా? అసలు నిజమైన కళ అంటే ఏమిటో వాటికి తెలుస్తుందా?” అని ప్రశ్నించారు.మైఖేలాంజెలో, డా విన్సీ, వాన్ గోహ్ లాంటి గొప్ప కళాకారులు సృష్టించిన కళాఖండాల వెనుక ఉండే లోతైన అర్థాన్ని యంత్రాలు ఎప్పటికీ అందుకోలేవని ఆయన తేల్చి చెప్పారు.
మరో నెటిజన్ ఒక అడుగు ముందుకేసి “అయితే నేను దీనికి పది డాలర్లు మాత్రమే చెల్లించాలేమో” అని కామెంట్ చేశారు.ఇంకొందరు ఏమో చెత్తను శుభ్రం చేయడం లేదా వ్యాధులకు మందులు కనుగొనడం వంటి నిజమైన సమస్యలను పరిష్కరించడానికి బదులు AIని కళ కోసం ఎందుకు ఉపయోగిస్తున్నారని నిలదీశారు.“విలువ అనేది ఆత్మలో ఉంటుంది.యంత్రాలు దానిని కాపీ చేయగలిగితే, మనకు తిప్పలు తప్పవు” అని ఒక యూజర్ కామెంట్ పెట్టారు.
విమర్శలు వెల్లువెత్తడంతో మోన్యుమెంటల్ ల్యాబ్స్ తమ పని విధానాన్ని వివరిస్తూ మరో పోస్ట్ చేసింది.రోబోలు కేవలం ప్రాథమిక ఆకృతిని మాత్రమే తయారు చేస్తాయని, ఆ తర్వాత మనుషులైన శిల్పులు సాంప్రదాయ పనిముట్లను ఉపయోగించి నెలల తరబడి తుది మెరుగులు దిద్దుతారని వారు చెప్పుకొచ్చారు.అంతేకాదు, ఈ పద్ధతి ఖర్చులను తగ్గిస్తుందని, నైపుణ్యం కలిగిన శిల్పులకు ఎక్కువ పని దొరుకుతుందని వారు వాదిస్తున్నారు.కానీ చాలా మంది మాత్రం ఇంకా నమ్మడం లేదు.“నిజమైన కళకు మానవ స్పర్శ కావాలి” అని ఒకరు కామెంట్ చేయగా, చాలా మంది దానికి మద్దతు తెలిపారు.యంత్రాలు సహాయపడగలవు కానీ, మానవ కళ వెనుక ఉండే ఆత్మను, అర్థాన్ని అవి ఎప్పటికీ భర్తీ చేయలేవని చాలా మంది నమ్ముతున్నారు.