సోషల్ మీడియాలో( social media ) కన్నీళ్లు పెట్టిస్తున్న ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఆ వీడియోలో కనిపించిన ఒక మహిళ కథ వింటే గుండె తరుక్కుపోతుంది.15 ఏళ్ల క్రితం, ఆమెకు కేవలం 16 ఏళ్లు ఉన్నప్పుడు, సొంత మేనమామ ఆమెను వ్యభిచార కూపంలో అమ్మేశాడు.అప్పటినుంచి మొదలైంది ఆమె నరకయాతన.
ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించింది.ఒకటే కోరిక.
ఎలాగైనా ఇంటికి తిరిగి వెళ్లాలి.చివరికి 15 ఏళ్ల తర్వాత ఆమెకు ఆ అవకాశం వచ్చింది.
కానీ అది ఆమె ఊహించిన సంతోషకరమైన రీ యూనియన్ కాదు.కంటెంట్ క్రియేటర్ అనిష్ భగత్ ( Anish Bhagat )ఈమె ప్రయాణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.
ఆ వీడియో 67 లక్షల వ్యూస్‌తో వైరల్ అయింది.
ఇంటికి వెళ్లే ముందు, ఆమెతో పాటు పనిచేసే మిగతా మహిళలు ఆమెను ప్రోత్సహించారు.ఆమె కుటుంబ సభ్యుల కోసం చిన్న చిన్న బహుమతులు కూడా ఇచ్చారు.వాళ్లంతా ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నారు.
ఆశ, భయం రెండూ కలిపి ఆమె తల్లి కోసం ఒక చీర, అన్నయ్య కోసం ఒక వాచ్ కొనుక్కుంది.అన్నయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడో కూడా ఆమెకు సరిగ్గా తెలీదు.
తండ్రి చనిపోయారని చెప్పింది.ఎన్నో ఆశలతో ఊరికి చేరుకుంది.
కానీ అక్కడ ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది.ప్రేమతో స్వాగతం కాదు కదా.కనీసం తలుపు కూడా తీయలేదు వాళ్లు. కుటుంబ సభ్యులు( Family members ) ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు మూసేశారు.“లోకులు ఏమంటారో అని భయపడ్డారే కానీ, నా బాధను పట్టించుకోలేదు” అని ఆ వీడియో క్యాప్షన్‌లో రాశారు.
“నేను ఈ జీవితాన్ని ఎంచుకోలేదు” అని ఆమె కన్నీళ్లతో చెప్పింది.“కానీ వాళ్లు నన్ను చూసింది నేనేదో తప్పు చేసినదాన్ని చూసినట్టు చూశారు” అని ఆవేదన వ్యక్తం చేసింది.ఈ హృదయ విదారక సంఘటన సోషల్ మీడియాలో ఎంతోమందిని కదిలించింది.
చాలామంది ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్లు పెట్టారు.ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మహిళలను అర్థం చేసుకోవాలని, వాళ్లని ఆదరించాలని కోరుతున్నారు.“ఆమెను అమ్మిన మేనమామని సమాజం అంగీకరిస్తుంది కానీ, బాధితురాలిని కాదు” అంటూ ఒక నెటిజన్ చేసిన కామెంట్ అందరినీ ఆలోచింపజేస్తోంది.బాధితుల పట్ల మరింత దయ, కనికరం చూపించాలని అందరూ అంటున్నారు.