భారత సంతతికి చెందిన గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాది హర్‌ప్రీత్ సింగ్‌ను( Terrorist Harpreet Singh ) అరెస్ట్ చేయడంపై అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
పంజాబ్‌లో ఉగ్రవాదం, ఉగ్రవాద దాడులకు సంబంధించి మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియా అలియాస్ జోరా.ఇతను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, ఖలిస్తానీ గ్రూప్ బీకేఐతో కలిసి పనిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
హ్యాపి సింగ్‌ను ఏప్రిల్ 18న ఎఫ్‌బీఐ, యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ శాక్రమెంటోలో అరెస్ట్ చేశాయి.

అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ ఉగ్రవాద ముఠాలో సభ్యుడైన హర్‌ప్రీత్ సింగ్ అరెస్ట్ అయినట్లు సోమవారం కాష్ పటేల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.అతను భారత్, అమెరికాలోని( India and America ) పోలీస్ స్టేషన్‌లపై భారీ ఎత్తున దాడులకు ప్రణాళికలు రూపొందించడంలో పాల్గొన్నాడని తాము విశ్వసిస్తున్నామని కాష్ పటేల్ అన్నారు.ఎఫ్‌బీఐ శాక్రమెంటో విభాగం దర్యాప్తు నిర్వహిస్తోందని.
స్థానిక అధికారులతో పాటు భారత్‌లోని మా భాగస్వాములతో సమన్వయం చేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.హింసకు పాల్పడేవారు ఎక్కడున్నా వారిని ఎఫ్‌బీఐ వెతుకుతూనే ఉంటుందని కాష్ తేల్చిచెప్పారు.

నిఘా సంస్థలు, భద్రతా ఏజెన్సీలకు దొరకకుండా హర్‌ప్రీత్ సింగ్ బర్నర్ ఫోన్లు, ఎన్‌క్రిప్టెడ్ అప్లికేషన్‌లను ఉపయోగిస్తున్నట్లు ఎఫ్‌బీఐ శాక్రమెంటో విభాగం తెలిపింది.ప్రపంచ భద్రతకు ముప్పు కలిగించే వారిని పట్టుకోవడంలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యతను ఈ కేసు బలోపేతం చేస్తుందని పేర్కొంది.ఈ ఏడాది జనవరిలో భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హర్‌ప్రీత్‌పై రూ.5 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది.చండీగఢ్‌లోని ఓ ఇంటిపై హ్యాండ్ గ్రెనేడ్ దాడి కేసులో హర్‌ప్రీత్‌ను గాలిస్తున్నారు.హర్‌ప్రీత్ సింగ్ పంజాబ్‌లోని అమృత్‌సర్ శివార్లలోని అజ్నాలా తహసీల్‌కు చెందిన వాడు.చండీగఢ్‌లోని సెక్టార్ 10/డీలోని ఓ ఇంటిపై జరిగిన హ్యాండ్ గ్రెనేడ్ దాడికి సంబంధించి అక్టోబర్ 1, 2024న నమోదైన కేసులో హర్‌ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు.ఇతనిని నాటి నుంచి భద్రతా సంస్థలు గాలిస్తున్నాయి.