తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అగ్ర కథానాయకుల్లో ఒకరైన మహేష్ బాబు( Mahesh Babu ) తన నటనతోనే కాకుండా, బయట చేసే మంచి పనుల వల్ల కూడా అభిమానుల మనసు గెలుచుకున్నవారు.అయితే తాజాగా ఆయన పేరు మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.దీనితో సినీ, వ్యాపార రంగాల్లో కలకలం రేపుతోంది.
తాజాగా ఈడీ అధికారులు సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ సంస్థలపై సోదాలు నిర్వహించారు.సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా( MD Narendra Surana ) ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది.
అలాగే సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీశ్ చంద్రగుప్త ఇంట్లోనూ అధికారులు పెద్ద మొత్తంలో నగదును సీజ్ చేశారు.ఆ సంస్థల కార్యాలయాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈడీ అధికారులు విచారణలో భాగంగా సినీ నటుడు మహేష్ బాబు పేరు బయటకు వచ్చింది.సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కంపెనీల యాడ్స్ సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనినందుకు ఆయన రూ.5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.అందులో రూ.3.4 కోట్లు నగదు రూపంలో, మిగతా రూ.2.5 కోట్లు RTGS ద్వారా తీసుకున్నట్టు సమాచారం.ఈ వ్యవహారంపై మహేష్ బాబును ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది.

సురానా గ్రూప్‌పై ( Surana Group )గతంలో కూడా భారీ మోసాల ఆరోపణలు ఎదురయ్యాయి.మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3,986 కోట్లు రుణంగా తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో బెంగళూరు సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది.సురానా సంస్థలు డమ్మీ డైరెక్టర్ల పేరుతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఈడీ ఆరోపిస్తోంది.

ఇక ఇదివరకు జరిగిన సోదాల్లో సురానా కంపెనీ నుంచి రూ.11.62 కోట్ల విలువైన బంగారం, నగదు సీజ్ చేశారు.తాజాగా ఈడీ అధికారులు మరోసారి సురానా గ్రూప్ సంస్థలపై దాడులు నిర్వహించి, డాక్యుమెంట్లతో పాటు పెద్ద మొత్తంలో డబ్బులు, మరిన్ని ఆధారాలను సేకరించారు.
సురానా గ్రూప్ విదేశాల్లో కంపెనీలు ఏర్పాటు చేసి అక్కడి నుండి వస్తువులు ఎగుమతి చేసినట్లు, వాటి ద్వారా వచ్చిన డబ్బు భారత్‌లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులుగా మలచినట్లు అధికారులు గుర్తించారు.