ప్రస్తుత రోజుల్లో థైరాయిడ్( Thyroid ) వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది.థైరాయిడ్ అనేది మన శరీరంలో ఉన్న ఒక ముఖ్యమైన గ్రంథి.
మెడ భాగంలో ఉండే ఈ థైరాయిడ్ గ్రంథి శరీరంలో మెటాబాలిజంను నియంత్రించే టీ3 – ట్రైయోడోథైరోనిన్, టీ4 – థైరాక్సిన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.అయితే స్ట్రెస్, జీవనశైలి మార్పులు, జన్యుపరమైన లక్షణాలు, అయోడిన్ లోపం, ఆటోఇమ్యూన్ వ్యాధులు, గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు థైరాయిడ్ గ్రంథి పనితీరును దెబ్బతీస్తాయి.
థైరాయిడ్ గ్రంథి పనితీరు ఎప్పుడైతే దెబ్బ తింటుంటో అప్పుడు ప్రధానంగా రెండు రకాల సమస్యలు వస్తాయి.ఒకటి హైపోథైరాయిడిజం.
మరొకటి హైపర్‌థైరాయిడిజం.
హైపోథైరాయిడిజంలో( Hypothyroidism ) థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అవుతాయి.
బరువు పెరగడం, అలసట, నిద్రలేమి, చలిని తట్టుకోలేకపోవడం, జుట్టు రాలిపోవడం, డ్రై స్కిన్, డిప్రెషన్ మరియు ఇతర మానసిక సమస్యలు హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు.అలాగే హైపర్‌థైరాయిడిజంలో( Hyperthyroidism ) థైరాయిడ్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి.
ఉన్నట్లుండి బరువు తగ్గిపోవడం, అధిక చెమటలు, మూడ్ స్వింగ్స్, చిరాకు, నిద్రలేమి, వణుకు, గుండె వేగంగా కొట్టుకోవడం అనేవి హైపర్‌థైరాయిడిజం లక్షణాలు.

థైరాయిడ్ సమస్య జీవితాంతం ఉండే సమస్యగా మారకూడదంటే, పైన చెప్పుకున్న లక్షణాల ద్వారా ప్రారంభ దశలోనే దానిని గుర్తించాలి.థైరాయిడ్ వ్యాధిని ముందుగా గుర్తిస్తే, జీవనశైలి మార్పులు, సరైన ఆహారం మరియు ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ద్వారా దానిని నియంత్రించుకోవచ్చు, కానీ పూర్తిగా నయం అవుతుందా లేదా అనేది సమస్య రకాన్ని మరియు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి మారుతుంది.

థైరాయిడ్ బారిన పడ్డవారు ప్రతి 6 నెలలకు ఒకసారి సంబంధిత టెస్టులు చేయించుకోవాలి.అయోడిన్, సెలీనియం, జింక్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి.రోజుకు 7-8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి.
నిత్యం కనీసం అరగంట వ్యాయామం చేయాలి.స్ట్రెస్ కు దూరంగా ఉండేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయాలి.
మరియు డాక్టర్ చెప్పిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి.తద్వారా థైరాయిడ్ సమస్యను పూర్తిగా నియంత్రించుకోవచ్చు.