మన పెద్దలు పాములు పగబడతాయని చెబుతూ ఉంటారు.శాస్త్రవేత్తలు పాములు పగబట్టవని పరిశోధనలు చేసి చెప్పినా కొన్ని ఘటనలు చూస్తే నిజంగా పాములు పగబడతాయేమోననని అనిపిస్తుంది.
కడప జిల్లాలో ఒక పాము ఒకే ఇంట్లో నలుగురిని కాటు వేసింది.జిల్లాలోని గాలివీడు మండలం ఎగువమూల గ్రామంలో చోటు చేసుకున్న ఘటన గ్రామంలో విషాదం నింపింది.
గ్రామంలోని వేణుగోపాల్ నాయుడు, ఈశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
నలుగురు చిన్నారులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన పాము నలుగురిని కాటు వేసింది.
అయితే నిద్రలో ఉన్న చిన్నారులకు తమకు పాము కాటు వేసిందని తెలియలేదు.నిన్న తెల్లవారుజామున ఇంట్లో పాము కనిపించడంతో వేణుగోపాల్ నాయుడు ఆ పామును చంపేశాడు.
అయితే ఏడు గంటల సమయంలో ఒక కుమారుడు గొంతునొప్పితో బాధ పడుతున్నానని చెప్పాడు.
దీంతో వేణుగోపాల్ నాయుడు పాము కరిచిందేమోనని అనుమానం వచ్చి సమీపంలోని నాటు వైద్యుని దగ్గర చికిత్స చేయించాడు.
అయితే అప్పటికే పాము కాటు వల్ల శరీరంలో ప్రవేశించిన విషం బాలుడి ప్రాణాలు తీసింది.మిగతా చిన్నారులు అస్వస్థతకు లోను కావడంతో వేణు గోపాల్ వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు.
మిగిలిన ముగ్గురు చిన్నారులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఒకే ఇంట్లో పాము నలుగురిని కాటు వేయడంతో పలువురు గ్రామస్థులు పాము పగ బట్టిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాలుడిని కాటు వేసిన పాము కట్ల పాము అని తెలుస్తోంది.
వైద్యులు పాము కాటు వేస్తే నాటు వైద్యం వల్ల ప్రాణాలకే అపాయం ఏర్పడుతుందని వీలైనంత త్వరగా ఆస్పత్రిలో చికిత్స చేయిస్తే మంచిదని సూచిస్తున్నారు.