సూర్యాపేట జిల్లా: మఠంపల్లి మండలం సుల్తాన్ పూర్ తండా గ్రామ శివారులోని కంపచెట్లలో బుధవారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన ఆడ శిశువును వదిలేసిన అమానవీయ సంఘటన గ్రామస్తులను కలవరానికి గురి చేసింది.గ్రామానికి చెందిన ఆశా వర్కర్ శాంతి కుమారుడు చందు ఉదయం 7:30 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్ళగా చెట్ల పొదల నుండి చిన్నారి ఆర్తనాదాలు విని వెళ్ళి చూడగా అప్పుడే పుట్టిన శిశువుగా గుర్తించి,ఆశా వర్కర్ అయిన తన తల్లికి విషయాన్ని తెలియజేసి పాపను తమ ఇంటికి తీసుకొచ్చాడు.కంప చెట్లలో పడేయడంతో పాప శరీరానికి ముళ్ళు గుచ్చుకుని తీవ్ర గాయాలయ్యాయి.
ఆశా వర్కర్ శాంతి వెంటనే పాపకు స్నానం చేయించి,స్థానికుల సహాయంతో పిహెచ్సీ సెంటర్ కు తరలించగా పాపను పరీక్షించిన పీహెచ్సీ డాక్టర్ సుధాకర్ నాయక్ పాపకు ప్రథమ చికిత్స చేసి,పరిస్థితి విషమంగా ఉందని హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సావిత్రి లోక్ మాట్లడుతూ ఉన్నతాధికారులకు సమాచారం అందించి,పాపకు మెరుగైన చికిత్స అందిస్తామన్నారు.అలాగే పాపను వదిలి వెళ్ళిన వారిని త్వరలోనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.