కోదాడ గులాబీ తోటలో గుబులు రేగుతుంది

సూర్యాపేట జిల్లా:2018 లో టీడీపీలో ఉండి టిక్కెట్ రాకపోతే టీవీ ఇంటర్వ్యూలో నాదగ్గర చిల్లి గవ్వ లేదని ఏడ్చి,కేసీఆర్ దగ్గరకు పోయి పార్టీ టికెట్ పొందిన కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కి నేడు మూడు తరాల తిన్నా తరగని ఆస్తి ఎలా సొంతమయ్యిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు.డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావును ఎమ్మెల్యేనే అక్రమంగా అరెస్ట్ చేయించారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం శుక్రవారం మాజీ ఎమ్మెల్యే,టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు వేనేపల్లి చందర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు.

 Kodada Rose Bushes In The Garden-TeluguStop.com

ఈ సందర్భంగా ముత్తవరపు పాండురంగారావు మాట్లాడుతూ కాపుగల్లు సొసైటీ ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని,82 లక్షల కుంభకోణం చేశాడని తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని,చార్జిషీట్ లేకుండా కోదాడ రూరల్ ఎస్సై సాయి ప్రశాంత్ ఉన్నఫలంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారని,కాపుగల్లు సొసైటీలో 15 వేల క్వింటాళ్ల,కోదాడ సొసైటీలో 3900 క్వింటాళ్ల ధాన్యం కుంభకోణం జరిగిందని 2015లో సొంత పార్టీ వారే కేసు పెట్టించారు.తిరిగి 2017లో తనను ముద్దాయిగా పెట్టి అధికార పార్టీ నాయకులే కేసులో ఇరికించారు.

తాను కాంగ్రెస్ లో ఉండి డిసిసిబి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మంత్రి కేటీఆర్ ఇతర నాయకుల ఒత్తిడితో టిఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు.నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలతో పాటు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని హామీతోనే పార్టీలో చేరానన్నారు.అలాగే కేసు విషయం కూడా తాను పరిష్కరిస్తానని చెప్పారని కానీ పట్టించుకోలేదని తాను హైకోర్టుకు పోయి ట్రిబ్యునల్ ద్వారా కేసు విచారణ ఎదుర్కొని,హైకోర్టు ఆదేశాలతో సివిల్ సప్లై కార్పొరేషన్ రూ.62 లక్షలు విడుదల చేస్తే రైతులకు చెల్లించడం జరిగిందన్నారు.ఇదంతా జరిగి ఏడాదిన్నర దాటిందని,రైతుల సొమ్ము తాను నిజంగా తింటే తన కుటుంబం సర్వనాశనం అవుతుందని,ఉద్దేశ పూర్వకంగా తనను కేసులలో ఇరికించిన వాళ్ళందరూ కూడా సర్వనాశనం అవుతారని శాపనార్థాలు పెట్టారు.బలవంతంగా పార్టీలో చేర్చుకొని గొంతులు కోయవద్దని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమాలకు పాల్పడేది ఎవరో నియోజక వర్గ ప్రజలకు తెలుసునని,మీ మట్టి,ఇసుక,వైన్స్, వెంచర్లు,దళిత బంధు అక్రమ వసూళ్లలో వాటాలు ఏమైనా అడిగామా అని అన్నారు.పార్టీ బాధ్యతలన్నీ ఎమ్మెల్యేకే అప్పగించి మిగతా నేతలను బలి పశువులను చేయవద్దన్నారు.

స్థానిక ఎమ్మెల్యే వల్ల పార్టీ నేతలు ఇబ్బంది పడుతున్నారని,తనకు జరిగిన అన్యాయంపై పార్టీలో ఉండి పోరాడుతానని ప్రకటించారు.తన అరెస్ట్ పై పోలీసులను వివరణ అడిగితే పైనుంచి ఒత్తిడి ఉందని,అందుకే అరెస్టు చేశామని చెప్పారన్నారు.

తాను ఒక్కడినే కాదు,ఉద్యమంలో పాల్గొన్న నాయకులతో పాటు,వెంట ఉండి గెలిపించిన నేతలను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అనేకమంది ఆస్తులు పోగొట్టుకుని ఉద్యమం చేశారని,నేడు ఈ ఎమ్మెల్యే వలన అనేక అవమానాలు,అవరోధాలు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.తనకు వ్యక్తిగత కూచికత్తుపై కోర్టు బేయిల్ మంజూరు చేసిందని,అవాస్తవమైన ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ఉద్యమ నేత, నియోజక వర్గ మాజీ ఇంచార్జ్ కె.శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్యాకేజీలకు అమ్ముడుపోయామనే ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.ఆస్తుల అమ్ముకొని ఉద్యమాలు చేశామని,మా ఆధార్ కార్డులు ఇస్తాం,మీవి కూడా ఇవ్వండి ఎవరి ఆస్తి ఎంత ఉందో తెలుస్తుందన్నారు.ఓ టీవీ ఇంటర్వ్యూలో ఏడ్చి,పార్టీ టికెట్ పొంది అప్పుడు నాకు చిల్లి గవ్వ లేదని చెప్పి,నేడు మూడు తరాల తిన్నా తరగని ఆస్తి ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు,ఎర్నేని బాబు,మార్కెట్ కమిటీ చైర్మన్ మహబూబ్ జానీ, చిలుకూరు ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య,టిఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ,చిలుకూరు మాజీ ఎంపీపీ నాగేంద్ర బాబు,నాగేశ్వరావు,గుండపనేని నాగేశ్వరరావు,రాజు,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube