ఏం చేసినా ఎలా చేసినా, అంతిమంగా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలలో గెలిచి టిఆర్ఎస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ఆ పార్టీ అధిష్టానం అనేక వ్యూహాలు పన్నుతోంది.బిజెపి, కాంగ్రెస్ పార్టీలు గెలుపు కోసం కొత్త తరహా రాజకీయాలు చేస్తూ, ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో టిఆర్ఎస్ కూడా అలర్ట్ అయింది.
ఓటర్ల చూపు టిఆర్ఎస్ వైపు ఉండే విధంగా అనేక ఎత్తుగడలకు తెర తీస్తోంది.ఈ నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికలు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు రెఫరెండం కాబోతుండడంతో, ఈ స్థాయిలోనే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇదిలా ఉంటే , ఈ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఎవరు ? వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు అనే విషయాల పైన ఆరా తీయడమే కాకుండా , ఈ నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల బంధువులను గుర్తించే పనిలో పడింది.ఇతర నియోజకవర్గాల్లో ఉన్న మునుగోడు ఓటర్ల బంధువులను గురించీ ఆరా తీస్తూ, ఆయా నియోజకవర్గాల్లోని టిఆర్ఎస్ నేతల ద్వారా మునుగోడు నియోజకవర్గంలోని ఓటర్లకు వారి బంధువులతో మాట్లాడిస్తూ, టిఆర్ఎస్ కు అనుకూలంగా వారు ఓటు వేసే విధంగా ఒప్పించే ప్రక్రియను మొదలుపెట్టినట్లు సమాచారం.
ఏ చిన్న అవకాశం దొరికినా వదిలి పెట్టకుండా ఫలితం తమవైపు ఉండేలా టిఆర్ఎస్ ఎత్తుగడలు వేస్తోంది.ప్రతి ఓటరూ కీలకమైన వారేనని, ఎవరిని వదిలిపెట్టకుండా మద్దతు కోరాల్సిందిగా పార్టీ నేతలకు ఆదేశాలు వెళ్లాయట.
ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండడం, మరో వైపు పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో టీఆర్ఎస్ మరింత అలెర్ట్ అవుతోంది.అలాగే తమ రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్ , బిజెపిలు ఎన్నికల్లో ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయో గుర్తించి, ఆ వ్యూహాలకు ధీటుగా ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు , ఇలా అందరినీ రంగంలోకి దించి మునుగోడు బాధ్యతలను అప్పగించారు.ఎప్పటికప్పుడు ఈ నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై నిఘా వర్గాల ద్వారా ఆరా తీస్తూ, తమ రాజకీయ ప్రత్యర్థుల ఎత్తుగడలను తెలుసుకుంటూ, తగిన వ్యూహాలను రచిస్తోంది.
ఏది ఏమైనా ఎన్నికల్లో గెలిచేందుకు, ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా, వదిలిపెట్టకుండా గట్టి ప్రయత్నాలు టిఆర్ఎస్ చేస్తుంది.దానిలో భాగంగానే మునుగోడు ఓటర్ల బంధువుల వివరాలను ఆరా తీస్తూ, వారిని సంప్రదిస్తూ వారి ద్వారానే మునుగోడు ఓటర్లు టిఆర్ఎస్ వైపు ఉండే విధంగా పార్టీ నాయకుల ద్వారా ప్రయత్నాలు చేస్తోంది.