నల్గొండ జిల్లా:రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.
పార్టీ మారిన చరిత్ర రేవంత్ రెడ్డిది.కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్.
కాంగ్రెస్ పార్టీకి మునుగోడు మంటలు అంటుకున్నాయి.వర్గపోరుకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే కాంగ్రేస్ లో రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఆ మంటలు మరింతగా ఎగిసిపడుతున్నాయి.
మొదట్లో సుతిమెత్తగా కనిపించిన మాటలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకుని మాటల యుద్ధానికి,దిష్టిబొమ్మల దహనాలకు దారితీస్తున్నాయి.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకొనే అవకాశాలు ఉన్నాయనే విషయం తెలిసిందే.
రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి బ్రాండ్ మీద చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి బ్రదర్స్ సీరియస్ అయిన విషయం కూడా తెలిసిందే.ఇప్పుడు అదే అంశం కాంగ్రేస్ లో అగ్గి రాజేస్తుంది.
గురువారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నకిరేకల్ పట్టణ కేంద్రంలో యూత్ కాంగ్రెస్, కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రాండ్ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి దిష్టిబొమ్మను అదే పార్టీకి చెందిన యూత్ నాయకులు దహనం చేయడం ఒక్క కాంగ్రేస్ పార్టీకే సాధ్యమని,కాంగ్రేస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ముదిరి అంతర్యుద్ధం మొదలైందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.