గత కొంతకాలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల పైనే ఫోకస్ పెట్టి బిజెపి ని మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేయాలని చూస్తున్నారు.ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలను ఏకం చేసే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారు.
సమయం దొరికినప్పుడల్లా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పర్యటిస్తూ అక్కడి ముఖ్యమంత్రులను కలుస్తూ… తన రాజకీయానికి రాచబాట వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.అందుకే తెలంగాణ పై కాస్త ఫోకస్ తగ్గించి తన బాధ్యతలను కేటీఆర్, హరీష్ రావు కు అప్పగించారు.
దేశవ్యాప్తంగా బిజెపికి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడం తనకు బాగా కలిసి వస్తుందని ,కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బలహీనం కావడంతో మూడో ప్రత్యామ్నాయ కూటమికి అవకాశం ఉందని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు.
ఇదిలా ఉంటే మరో సారి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.
దాదాపు పది రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి కీలక రాజకీయ అంశాలపై మేధావులు, మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు, ఇక ఆ తర్వాత వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని ప్రకటించారు .ఈ మేరకు 500 కుటుంబాలకు సహాయం చేయనున్నారు.ఆ కుటుంబాలకు సంబంధించిన సమాచారం మొత్తం తెప్పించుకున్నారు.
ఇక ఢిల్లీ పర్యటన అనంతరం బెంగుళూరు కు కేసీఆర్ వెళ్ళబోతున్నారు.అక్కడ రాజకీయ అంశాలపై చర్చించనున్నారు.

ఇక వరుసగా ఒక్కో రాష్ట్రంలో తిరుగుతూ అక్కడే బీజేపీ వ్యతిరేక పార్టీ లను ఏకం చేసి, తన దారిలోకి తెచ్చుకునే వ్యూహాన్ని అమలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా తాను మాత్రం ఈ ప్రయత్నాల్లో వెనకడుగు వేయకుండా పోరాటం చేయాలనే విధంగా కెసిఆర్ అడుగులు వేస్తున్నారు.ప్రస్తుతం కేసీఆర్ కదలిక పైన కేంద్ర బీజేపీ పెద్దలు దృష్టిసారించారు.