మొన్నటివరకు రాజకీయ సంక్షోభంతో కొట్టుకున్న రాజస్థాన్ సర్కార్ లో ఇప్పుడు కరోనా కలకలం రేపింది.అక్కడ నెలకొన్న రాజకీయ సంక్షోభం విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కలుగజేసుకొని మొత్తానికి ఒక కొలిక్కి తీసుకురాగా, ఇప్పుడు సీఎం గారి అధికారిక కార్యాలయం లో కరోనా కలకలం రేగింది.
గత కొద్దిరోజులుగా సీఎంఓ, అధికారిక నివాస సిబ్బందిలో చాలా మంది కరోనా బారినపడుతున్నారు.ఇప్పటివరకు 40 మంది సీఎంఓ సిబ్బందికి కరోనా సోకడం తో సీఎం అశోక్ గెహ్లాట్ గారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వరుసగా సీఎంఓ సిబ్బంది కరోనా బారిన పడుతుండడం తో నెల రోజుల పాటు ప్రజలను కలవకూడదు అంటూ సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.దీంతో నెల రోజులపాటు ప్రజలను ఎవరినీ కలవకుండా,ఎలాంటి వినతి పత్రాలను కూడా నేరుగా తీసుకోకూడదు అంటూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ నెల రోజుల పాటు కార్యకలాపాలు స్తంభించకుండా ఉండడం కోసం ఈ ముప్పైరోజులపాటు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా మాత్రమే ప్రజల సమస్యలను తెలుసుకుంటారని గెహ్లాట్ సర్కార్ పేర్కొంది.
అంతేకాకుండా దేశంలో నెలకొంటున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో తప్పనిసరిగా ప్రజలు భౌతిక దూరం పాటించాలని, అలానే మాస్క్ లు కూడా విధిగా ధరించాలి అంటూ గెహ్లాట్ సర్కార్ కోరినట్లు తెలుస్తుంది
.