ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది.ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతుంది.
ఈ రెండేళ్ల కాలంలో కన్నా పార్టీని ఎంతవరకు పార్టీని ముందుకు తీసుకు వెళ్లారు అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఏపీ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కన్నా మాత్రం తన పదవిని అధిష్టానం రెన్యువల్ చేస్తుందనే ఆశలో ఉన్నారు.
ఏపీ బీజేపీ అధికారంలోకి తీసుకురావడమే తన ఏకైక లక్ష్యం అంటూ అప్పట్లో కన్నా ప్రకటించారు.అసలు బిజెపి కన్నాకు అధ్యక్ష పదవిని ఇవ్వడానికి కారణం ఆయన సామాజిక వర్గం.
ఏపీలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నాను బీజేపీ అధ్యక్షుడుని చేస్తే జనసేన పార్టీ ఓటు బ్యాంకును దెబ్బతీయవచ్చు అని, తాము బాగా లాభపడవచ్చని బీజేపీ అధిష్టానం భావించింది.ఆ సమీకరణాలు నేపథ్యంలోనే కన్నాకు బీజేపీ అధ్యక్ష పదవి దక్కింది.
ఈ రెండేళ్ల కాలంలో కన్నా పార్టీ పటిష్టత కోసం చేసిందేమిటి అనే చర్చ ఇప్పుడు మొదలైంది.దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పార్టీ పటిష్టత కోసం కన్నా ఏం చేశారు అనేది ఒక విషయం అయితే అధిష్టానం పెద్దలతో కన్నా సఖ్యతగా ఉండడంలేదు అనే విషయంపై చర్చ జరుగుతోంది.అంతే కాదు ఇప్పుడు కన్నా రాజకీయ భవిష్యత్తు కూడా ఆ విషయాలపైనే ఆధారపడి ఉంటుంది.
ఈ లెక్కన చూసుకుంటే కేంద్ర బీజేపీ పెద్దలతో కన్నా అంత లౌక్యంగా వ్యవహరించలేదనే చెప్పుకోవాలి.భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఏపీ బీజేపీ లో పెద్ద ఎత్తున అనుచరులు ఉన్నారు.

ఇప్పటికీ వారు తమ హవాను చాటి చెప్పుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటారు.అలాగే రెండు మూడు గ్రూపులు ఏపీ బీజేపీ లో ఉన్నాయి.వారందర్నీ ఏకతాటి పైకి తెచ్చే విషయంలో కన్నా పూర్తిగా విఫలమయ్యారు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది.అలాగే సొంత సామాజికవర్గానికి చెందిన నాయకులను తన వైపు తిప్పుకోవడం లో విఫలం అయ్యారు అనే అభిప్రాయం కూడా పార్టీ శ్రేణుల్లో ఉంది.
ఇక ఏపీ అధికార పార్టీ వైసిపి విషయంలో కన్నా మొదటి నుంచి తప్పటడుగులు వేస్తూ వస్తున్నారు.కేంద్ర బిజెపి పెద్దలు వైసీపీ కి మద్దతు గా వ్యవహరిస్తూ వస్తుంటే, కన్నా వారికి అనుగుణంగా నడుచుకోవడం మానేసి ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో కలిసి పోరాటాలు, ఉద్యమాలు చేయడం ఇవన్నీ బీజేపీ శ్రేణులకు అయోమయాన్ని కలిగిస్తున్నాయి.
బిజెపి అధిష్టానం కూడా కన్నా విషయంలో అంత సదభిప్రాయం వ్యక్తం చేయడం లేదు.