ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam ) అలెర్ట్ అయింది.వాతావరణ శాఖ కూడా భారీ వర్షాలపై హెచ్చరికలు చేయడంతో టీటీడీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది.
ముందస్తుగా అన్ని జాగ్రత్త చర్యలకు దిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే ఏర్పాట్లు చేయాలని టిటిడి ఈవో అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే తిరుమల తో పాటు, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.నడక మార్గంలో ప్రత్యేకంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందన్న సమాచారంతో, మెట్ల మార్గాన్ని ఈరోజు వరకు మూసివేయాలని టిటిడి నిర్ణయించుకుంది.భారీ వర్షాల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఈవో అధికారులను ఆదేశించారు.
ప్రతినెల పౌర్ణమి రోజున టీటీడీ గరుడసేవ నిర్వహిస్తోంది.దీనిలో భాగంగా ఈరోజు రాత్రి తిరుమల మాడవీధుల్లో శ్రీ మల్లప్ప స్వామి( Sri Mallappa Swamy ) వారు గరుడుని పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.దీనికి భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.ఈ మేరకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి , ఎక్కడా ,ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా వాటిపై నిఘా ఉంచి, ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఈవో ఆదేశించారు.విద్యుత్ శాఖ ముందస్తు జాగ్రత్తగా జనరేటర్ల కోసం డీజిల్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
ఐటీ వింగ్ భక్తుల దర్శనాలు, వసతి ప్రసాదం వంటి కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఆదేశించారు.ఘాట్ రోడ్లలో జెసిబిలను సిద్ధంగా ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ట్రాఫిక్ పోలీసులు ఇంజనీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు.ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వైద్యశాఖ అంబులెన్స్ లను అందుబాటులో పెట్టుకుని సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలన్నారు.ఇంజనీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఇప్పటికే పాప వినాశనం, శిలాతోరణం మార్గాలను టీటీడీ మూసివేసింది.