ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా… అధికార పార్టీ వైసీపీతో సహా టిడిపి ,జనసేన , బిజెపి వంటి పార్టీలు ఎన్నికల హడావుడి మొదలు పెట్టేశాయి.జనాల్లో పలుకుబడి పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తూనే .
సర్వేలు చేయిస్తూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే , తమ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనే అంచనాకు వస్తున్నాయి.దీనికి తోడు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారనే సంకేతాలతో మరింతగా అన్ని పార్టీలు అలర్ట్ అవుతూ కార్యాచరణను రూపొందించుకున్నాయి .ఇప్పటికే బీజేపీ వివిధ యాత్రల పేరుతో ఏపీ అంతట పర్యటనలు మొదలుపెట్టగా, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం బస్సు యాత్రకు వచ్చేనెల 5 న శ్రీకారం చుట్టెందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
అయితే అకస్మాత్తుగా లోకేష్ తన పాదయాత్రను వచ్చే ఏడాది జనవరి కి వాయిదా వేసుకోగా, పవన్ కళ్యాణ్ సైతం బస్సు యాత్రను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు .ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా, ఇలా వాయిదా వేసుకోవడానికి కారణాలు ఎన్నెన్నో కనిపిస్తున్నాయి.జగన్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళరు అనే స్పష్టత రావడంతోనే వీరు తమ యాత్రలను వాయిదా వేసుకోవడానికి కారణంగా తెలుస్తోంది.నారా లోకేష్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు చేపట్టాలని ముందుగా షెడ్యూల్ రూపొందించుకున్నారు.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చేందుకు ఆ పాదయాత్రే ఏ స్థాయిలో దోహదం చేసిందో చంద్రబాబుకు బాగా తెలుసు.అందుకే లోకేష్ గ్రాఫ్ పెంచడంతో పాటు, టిడిపిని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా లోకేష్ పాదయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే చేపట్టినా… ఇప్పుడు యాత్రను చేపట్టడం ద్వారా ప్రయోజనం ఉండదని, ఎన్నికల సమయం వరకు యాత్ర కొనసాగే విధంగా జనవరి కి దానిని మార్చినట్లు సమాచారం.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.ముందస్తుగా బస్సు యాత్ర చేపట్టినా సొమ్ములు వృధా అని, ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిన సమయంలో బస్సు యాత్ర చేపట్టి రాష్ట్రమంతా పర్యటనలు చేయడం ద్వారా జనసేనకు ఊపు తీసుకురావచ్చనే లెక్కల్లో ఉన్నారట.జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన విరమించుకోవడంతోనే అటు టిడిపి ఇటు జనసేన సైతం తమ యాత్రలకు బ్రేకులు వేశాయట.