పంజాబీ గాయకుడు , కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసు( Sidhu Moose Wala Murder Case )లో కీలక నిందితుడు లారెన్స్ బిష్ణోయ్( Lawrence Bishnoi ) గ్యాంగ్‌కు అత్యంత సన్నిహితుడైన ఉగ్రవాది గోల్డీ బ్రార్‌తో పాటు మరొకరిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది.సదరు గ్యాంగ్‌స్టర్ చండీగఢ్‌లోని ఒక వ్యాపారవేత్త ఇంట్లో దోపిడీ, కాల్పులు ఘటన వెనుక ప్రధాన సూత్రధారిగా ఎన్ఐఏ పేర్కొంది.గోల్డ్ బ్రార్ కెనడా లేదా యూఎస్‌లో ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు పబ్లిక్ నోటీసులో వెల్లడించింది.
![Telugu Cash Reward, Chandigarh, Goldy Brar, Punjab, Sidhu Moosewala-Telugu NRI Telugu Cash Reward, Chandigarh, Goldy Brar, Punjab, Sidhu Moosewala-Telugu NRI](https://telugustop.com/wp-content/uploads/2024/07/Chandigarh-NIA-Lawrence-Bishnoi-announces-cash-reward-Sidhu-Moosewala-Goldy-Brar.jpg)
వీరిలో ఎవరినైనా అరెస్ట్ చేసేందుకు దారితీసే సమాచారాన్ని అందించిన వ్యక్తి గుర్తింపు రహస్యంగా ఉంచబడుతుందని ఏజెన్సీ తెలిపింది.మార్చి 8న వ్యాపారి ఇంటిపై కాల్పులు జరిగాయి.గోల్డీ బ్రార్, గోల్డీ రాజ్‌పురాలపై భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం ఆయుధాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.గోల్డీ బ్రార్ కెనడాలోని టాప్ 25 మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.
ఎవరీ గోల్డీ బ్రార్:
![Telugu Cash Reward, Chandigarh, Goldy Brar, Punjab, Sidhu Moosewala-Telugu NRI Telugu Cash Reward, Chandigarh, Goldy Brar, Punjab, Sidhu Moosewala-Telugu NRI](https://telugustop.com/wp-content/uploads/2024/07/NIA-announces-reward-Sidhu-Moosewala-Goldy-Brar.jpg)
ఇతని అసలు పేరు సతీందర్ సింగ్.పంజాబ్ రాష్ట్రంలోని ముక్త్‌సర్ సాహిబ్ ప్రాంతానికి చెందిన వాడు.కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో బిష్ణోయ్ తరపున గోల్డీ బ్రార్ వసూళ్ల దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో లారెన్స్ బిష్ణోయ్‌కి.మరో గ్యాంగ్‌స్టర్ దవిందర్ బంభిహాకు మధ్య గ్యాంగ్ వార్ నడుస్తోంది.
పంజాబ్ సహా ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో రెండు గ్యాంగ్‌లు పరస్పరం దాడులు, ప్రతిదాడులకు పాల్పడుతున్నాయి.
గోల్డీ బ్రార్ సన్నిహితుడు, విద్యార్ధి నేత మిద్దుఖేరాను బంభిహా గ్యాంగ్ హతమార్చింది.
దీనికి ముందు బ్రార్ సమీప బంధువు గుర్లాల్ బ్రార్ కూడా హత్యకు గురయ్యాడు.ఇతను బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ హత్యకు ప్రతీకారంగా కాంగ్రెస్ నేత గురులాల్ పహిల్వాన్‌ను లారెన్స్ గ్యాంగ్ హత్య చేసింది.
ఈ కేసులో కీలక నిందితుడిగా వున్న గోల్డీ బ్రార్ కెనడాకు పారిపోయాడు.పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ గోల్డీ బ్రార్ ప్రధాన నిందితుడు.
సిద్ధూని హతమార్చేందుకు వ్యూహ రచన, దానిని అమలు చేయడం, షూటర్లకు ఆయుధాలు పంపడం వంటి విషయాలను బ్రార్ పర్యవేక్షించినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది.గోల్డీబ్రార్‌ను భారత ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఉగ్రవాదిగా ప్రకటించింది.
యూఏపీఏలోని సెక్షన్ 35లోని సబ్ సెక్షన్ (1)లోని క్లాజ్ (ఏ) ద్వారా అందించిన అధికారాలను అమలు చేస్తున్నట్లు హోంశాఖ పేర్కొంది.నాల్గవ షెడ్యూల్‌లో అతని పేరును 56వ ఉగ్రవాదిగా చేర్చినట్లు హోం మంత్రిత్వశాఖ తెలిపింది.
బ్రార్ అతని అనుచరులు పంజాబ్‌లో శాంతి, మత సామరస్యం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర పన్నినట్లుగా హోంశాఖ పేర్కొంది.విధ్వంసం, టెర్రర్ మాడ్యూళ్లను పెంచడం, టార్గెట్ కిల్లింగ్స్, ఇతర దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఈ గ్యాంగ్ పాల్పడుతున్నట్లు తెలిపింది.