రాజకీయంగా జనసేన పార్టీ గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో కాస్త బలం పుంజుకుంది.దీనికి కారణం 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిడిపి, జనసేన తో పొత్తు పెట్టుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది .
జనసేన సహకారం ఉంటే ఏపీలో తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని నమ్ముతోంది .అందుకే జనసేన తో పొత్తు కోసం అనేక రకాల ఒత్తిళ్లు చేస్తున్నారు.ఇక బీజేపీ సైతం జనసేన తో పొత్తు ముందు ముందు కొనసాగించాలని… ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో జనసేన కలవకుండా చేయాలని చూస్తోంది ఎలా చూసినా, ఈ రెండు పార్టీలు తననే నమ్ముకున్నాయి అనే అభిప్రాయంతో ఉన్న జనసేన సొంతంగానూ ఏపీలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈ మేరకు జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా పర్యటనలు జనసేన అగ్ర నాయకులు చేస్తున్నారు.ఇటీవల పవన్ కొన్ని జిల్లాల్లో పర్యటించారు.
తాజాగా ఉత్తరాంధ్ర ప్రాంతంపై పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు దృష్టిపెట్టారు.జూన్ 1 నుంచి ఆయన ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు.
అంతే కాదు నాగబాబు ను ఉత్తరాంధ్ర కు ఇన్చార్జిగా జనసేన తరఫున నియమించారు.అయితే ఈ ఇంచార్జి పదవి ఇవ్వడం వెనుక కారణాలు చాలా ఉన్నాయట.
2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి నాగబాబు ఎంపీ అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేశారు.కానీ ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురవడంతో సైలెంట్ అయిపోయారు .ఆ నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేస్తారని అంతా అనుకుంటుండగా… ప్రస్తుతం వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎన్నికల సమయం నాటికి జనసేన లో చేరేందుకు , జనసేన తరపున ఎంపీగా పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట.రఘురామ విషయంలో పవన్ సైతం సానుకూలంగా ఉండడంతో నాగబాబు నరసాపురం నియోజకవర్గం తాను త్యాగం చేయాల్సి ఉంటుందనే విషయాన్ని ముందుగానే గ్రహించారు.
అందుకే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.ఇక్కడి నుంచి అయితే సులువుగా గెలవచ్చు అని, ఎంపీ అవ్వాలి అనే తన ఆశ కూడా తీరుతుంది అని నాగబాబు భావిస్తున్నారట.
అందకే నాగబాబు కి ఇప్పుడు ఉత్తరాంధ్ర బాధ్యతలు పవన్ అప్పగించినట్లు సమాచారం.