నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ( Miryalaguda ) నియోజకవర్గంలో నేరానికి పాల్పడాలంటే నేరగాళ్ల వెన్నులో వణుకు పుడుతోంది.పోలీస్ విభాగమంతా డీఎస్పీ రాజశేఖర్ రాజు ( DSP Rajasekhar Raju )ఆధ్వర్యంలో నేరాల దర్యాప్తులో తమదైన శైలిలో శివలెత్తిపోతూ నేరం జరగిన గంటల్లోనే కేసులను చేధిస్తూ తెలంగాణ పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
నియోజకవర్గ పోలీసులు కేసుల పురోగతిపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేత అభినందనలు అందుకుంటున్నారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ( District SP Sarath Chandra Pawar )మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం…ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో వ్యవసాయ పొలాల వద్దనున్న ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకొని,వాటిని డ్యామేజ్ చేసి,అందులో గల కాపర్ వైర్లను,ఆయిల్ ను దొంగిలిస్తున్న వైనంపైపోలీసులు దృష్టి సారించారు.
గురువారం వాడపల్లి ఎస్ఐ రవి తమ సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో నర్సాపురం రోడ్డులో ఐదుగురు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించడంతో వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారణ చేయగా వారు మెగావత్ రంగానాయక్,జటావత్ ఇమామ్ నాయక్,షేక్ మౌలానా,షేక్ వలి, కేతావత్ సునీల్ గా గుర్తించి,తమదైన శైలిలో విచారణ చేయగా జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల దోపిడికి పాల్పడి,దొంగిలించిన వాటిని హైదరాబాదులో పాత ఇనుప సామాను వ్యాపారస్తులకు అమ్ముతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నట్లు నేరాన్ని అంగీకరించారు.వారి దగ్గర నుండి రూ.9 లక్షల నగదు,షిఫ్ట్ డిజైర్ కారు,నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.32 కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.నేరస్తులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు,టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్ బాబు, వాడపల్లి ఎస్ఐ రవి,టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మహేందర్, సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందనలు తెలిపారు.