అప్పు చేసి పప్పు కూడు అన్నట్టుగా ఏపీ పరిస్థితి ఉందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా, ఏపీ సీఎం జగన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.తప్పు చేస్తున్నా ప్రజల కోసమే కదా అన్నట్టుగా ఆయన ఆ విమర్శలు పట్టించుకోవడం లేదు.
ఏడాది పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు.ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోక పోయినా కష్టకాలం చుట్టుముట్టినా, జగన్ సంక్షేమ పథకాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు.
కొత్త కొత్త పథకాలను అమలు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎక్కడా నిర్లక్ష్యం చేయడంలేదు అనే సంకేతాలు ఇచ్చారు.ఇక పూర్తిగా ప్రజాసంక్షేమ పథకాల పైన దృష్టి పెట్టడం, పార్టీ వ్యవహారాల్లో అంతగా జోక్యం చేసుకోవడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొంతమంది మంత్రుల్లోనూ అసంతృప్తి రేకెత్తిస్తోంది.

జగన్ ను కలిసేందుకు తమకు కనీసం అపాయింట్మెంట్ కూడా దక్కడం లేదని, వారు అభిప్రాయపడుతున్నారు.కొంతమంది బహిరంగంగానే జగన్ తీరును విమర్శిస్తూ వస్తున్నారు.ఈ పరిణామాలు జగన్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.ముఖ్యంగా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఈ ఇద్దరూ మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నా, జగన్ సీరియస్ గా తీసుకుంటున్నారు.
ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారం ఎలా ఉన్నా, రఘురామకృష్ణంరాజు వ్యవహారం మాత్రం జగన్ కు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని కలిగిస్తోంది.

పదేపదే ఆయన పార్టీకి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించడంతో పాటు, ఇప్పుడు సొంత కార్యకర్తలపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, లోక్ సభ స్పీకర్, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలు జగన్ సీరియస్ గా తీసుకున్నారు.వారిని కట్టడి చేయకపోతే ముందు ముందు పార్టీకి నష్టం చేకూరేలా వ్యవహరిస్తారనే అభిప్రాయానికి వచ్చిన జగన్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తోపాటు, రాంనారాయణరెడ్డి ఇద్దరికీ పార్టీ తరఫున నోటీసు ఇచ్చి వారి వివరణ తీసుకోవాలని చూస్తున్నట్లుగా వైసీపీ వర్గాల్లో నడుస్తున్న చర్చ.ఇద్దరికీ నోటీసులు ఇవ్వడం ద్వారా పార్టీ గీత దాటిన వారు ఎవరినీ, వదిలిపెట్టబోను అనే సంకేతాలు జగన్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.