బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రంలోని భూములను అమ్మి జగన్ తన నవరత్నాలను అమలు చేస్తామని చెప్పిన సంగతి తెలుసు కదా.పథకాల అమలు కోసం ఉన్న భూములను అమ్ముకోవడం ఏంటి అన్న విమర్శలు వచ్చాయి.
అయితే ఇప్పుడు అంతకన్నా దారుణాలు జరిగిపోతున్నాయి.బిల్డ్ ఏపీ సంగేమోగానీ.
రాష్ట్ర వ్యాప్తంగా బిల్డ్ వైసీపీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం తన స్నేహితుడో కాదో తెలియని పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే జగన్ కూడా వెళ్తున్నారు.బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చాం కదా అని రాజధానితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ కార్యాలయాలు నిర్మించడానికి ప్రభుత్వ భూముల సేకరణ జరుగుతోంది.అచ్చూ తెలంగాణలోనూ ఇలాగే టీఆరెస్ పార్టీ కార్యాలయాల కోసం విలువైన భూములను సేకరించారు.

తమకు కూడా జిల్లా కేంద్రాల్లో రెండు ఎకరాలు, రాజధానిలో నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలని కోరుతూ గత అక్టోబర్ 23నే వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి.రాష్ట్ర సీఎస్‌కు లేఖ రాశారు.ఆ వెంటనే జిల్లా కేంద్రాలకు ఆదేశాలు వెళ్లిపోయాయి.ప్రస్తుతం వైసీపీ నేతలంతా ఆ భూములను వెతికే పనిలో ఉన్నారు.
ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాల్లో పది కోట్ల విలువైన స్థలంలో పార్టీ ఆఫీస్ నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.ఇల్లయినా, ఆఫీసైనా విలాసాన్ని కోరుకునే జగన్.
ఈ కార్యాలయాలను కూడా అదే రేంజ్‌లో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.సాధ్యమైనంత వరకూ ఖరీదైన ప్రభుత్వ స్థలాలపైనే వైసీపీ నేతలు కన్నేశారు.