నిపుణులైన వృత్తి పనివారిని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పనిచేసుకోవడానికి అనుమతించే హెచ్ 1 బీ వీసాకు సంబంధించి ఫెడరల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.2022 ఆర్ధిక సంవత్సరానికి గానూ.హెచ్-1 బీ తదితర వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తాత్కాలికంగా వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ సహా కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.
అయితే స్థానిక పరిస్థితులను బట్టి యూఎస్ ఎంబసీ, కాన్సులేట్లు వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించే అధికారాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది.అందువల్ల.వీసా దరఖాస్తుదారులు ఎప్పటికప్పుడు సంబంధిత ఎంబసీ, కాన్సులేట్ వెబ్‌సైట్లను చెక్ చేస్తూ వుండాలని అమెరికా ప్రభుత్వం సూచించింది.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.
ఇప్పటివరకు ఏదైనా వీసా పొందిన వారు, వీసా మినహాయింపు ప్రోగ్రామ్‌లోని సభ్య దేశాల పౌరులు, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ కింద గతంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారు.ఇప్పుడు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు చేసే విచక్షణాధికారం కాన్సులేట్ అధికారులకు ఉంటుంది.
సాధారణంగా అమెరికా వీసాల కోసం వివిధ దేశాల అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం యూఎస్ కాన్సులేట్ అధికారులు దరఖాస్తులను పరిశీలించి.వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేస్తారు.
అందులో ఎంపికైతేనే వీసాలు జారీ అవుతాయి.అయితే ప్రస్తుతం కరోనా తీవ్రత నేపథ్యంలో 2022లో ఈ ఇంటర్వ్యూ విధానాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి, వీసాల జారీని మరింత సరళతరం చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.
కాగా.హెచ్-1బీ వీసాల జారీ విషయంలో గతంలో మాదిరిగా లాటరీ విధానాన్నే అనుసరించాలని అమెరికా ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఈ మేరకు నార్త్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా కోర్టు ఆదేశాలను అమలుచేయనున్నట్టు అమెరికా అంతర్గత భద్రతా విభాగం పేర్కొంది.డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో లాటరీ విధానాన్ని రద్దు చేసి, వేతనం ఆధారంగా హెచ్-1వీ వీసాలను జారీచేయాలని ప్రతిపాదించారు.
దీనికి అనుగుణంగానే యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ మార్గదర్శకాలు జారీచేసింది.అయితే జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత… ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదనను 2021 డిసెంబరు 31 వరకు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అలాగే చాంబర్ ఆఫ్ కామర్స్ సైతం ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదనపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.దీనిపై విచారణ జరిపిన కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు… వేతనం ఆధారంగా వర్క్ వీసాల జారీ విధానాన్ని కొట్టేసింది.