తిరుమలలో ఉన్నవి ఏడు కొండలు కాదు.రెండు కొండలే అని అప్పట్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే.
ఇప్పుడిదే అంశాన్ని గుర్తు చేస్తూ జగన్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర్‌రావు.తిరుమల అంశంలో జగన్ కూడా వైఎస్ బాటలోనే వెళ్తున్నారని ఆయన అన్నారు.

జగన్ వచ్చినప్పటి నుంచీ తిరుమలలో అన్నీ అపచారాలే జరుగుతున్నాయని బోండా ఉమ ఆవేదన వ్యక్తం చేశారు.తాజాగా టీటీడీ వెబ్‌సైట్‌లో శ్రీ ఏసయ్య అనే పదం కనిపించడంపై ఆయన స్పందించారు.శ్రియై నమః అన్న పదమే గూగుల్ తప్పిదం కారణంగా శ్రీ ఏసయ్యగా మారిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇవ్వడం వింతగా ఉందని ఉమామహేశ్వర్‌రావు అన్నారు.

తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఆ నెపాన్ని ప్రతిపక్షాలు, పత్రికలపై వేస్తున్నారని ఆరోపించారు.తిరుమల కొండపై సిలువ కనిపించడం, టికెట్లపై అన్యమత ప్రచారం, తిరుమలలో అన్యమత ఉద్యోగులు, వెబ్‌సైట్‌లో ఏసుక్రీస్తును కీర్తిస్తూ ఉన్న పుస్తకం, అమరావతిలో శ్రీవారి ఆలయానికి నిధులు తగ్గించడం, దర్శనానికి వచ్చిన జగన్ డిక్లరేషన్ సమర్పించకపోవడం, మైల ఉన్న సమయంలో పట్టువస్త్రాలు సమర్పించడం, తిరుమలలో వసతి, ప్రసాదం రేట్లు భారీగా పెంచడంలాంటి చర్యలు జగన్ సర్కార్ చేసిందని బోండా ఉమ విమర్శించారు.