ఎన్ని ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ఏపీ అధికార పార్టీ వైసిపికి రావాల్సినంత స్థాయిలో రాజకీయ మైలేజ్ అయితే రావడం లేదు.జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, సంచలన నిర్ణయాలు గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ చోటు చేసుకోలేదు.
అందరినీ ఆకట్టుకునే విధంగా సరికొత్త ఎత్తుగడలతో జగన్ ముందుకు వెళ్తున్నా, ప్రభుత్వానికి పార్టీకి ఉపయోగపడటం లేదు.ఈ విషయం పై చాలా కాలం నుంచి జగన్ కు అసంతృప్తి ఉంది.
ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మంచి దూకుడు మీద ఉంది.అయినా వైసీపీ ప్రభుత్వానికి రావాల్సిన క్రెడిట్ దక్కకుండా చేస్తూ, చిన్న చిన్న లోపాలను సైతం ఎత్తి చూపిస్తూ, ప్రజల్లోకి వాటిని బలంగా తీసుకువెళుతూ వస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం ఏపీ లో దేవాలయాల్లోని విగ్రహాలు ధ్వంసం సంఘటనలపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బీజేపీ పెద్ద ఎత్తున వైసీపీ పై విమర్శలు చేయడమే కాకుండా, వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వైసిపి ప్రభుత్వం ను అభాసుపాలు చేసింది.ఆ తరువాత జరిగిన నష్టం ఏమిటో గుర్తించిన జగన్ ఆగ మేఘాల మీద తమ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించారు.

ప్రస్తుతం పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను గురించి ప్రస్తావించడంతో పీకే ఏపీ వ్యవహారాల పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.వివిధ అంశాలపై విశ్లేషించిన ప్రశాంత్ కిషోర్ జగన్ దానికి సంబంధించిన రిపోర్ట్ అందించినట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం పెరగడం, గతంలో ఉన్నంత యాక్టివ్ గా నాయకులు లేకపోవడం, నియోజకవర్గాల్లో నెలకొన్న అసంతృప్తి, ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకువెళ్లే విధంగా ప్రచారం చేసుకోలేకపోవడం, సోషల్ మీడియాలోనూ గతంలో ఉన్నంత యాక్టివ్ గా లేకపోవడం, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మంచి రిలేషన్ మెయింటెయిన్ చేయకపోవడం ఇలా ఎన్నో అంశాల గురించి జగన్ కు చెప్పినట్లు తెలుస్తోంది.అలాగే వీటికి సంబంధించిన పరిష్కార మార్గాలను సూచించినట్లు సమాచారం.
పీకే సలహాలతో అయినా జగన్ జాగ్రత్తపడితేనే ప్రతిపక్షాలకు రాజకీయంగా అవకాశం లేకుండా చేసేందుకు వీలవుతుంది.