పాలకులు తప్పు చేశారని భావిస్తే వారిని నిలదీసే, ప్రశ్నించే హక్కు ప్రజలకు, రాజకీయ నాయకులకు ఉంది.ఇది ప్రజాస్వామ్యం కాబట్టి తప్పు చేశారని భావించిన పాలకులపై పోలీసు కేసులు కూడా పెట్టొచ్చు.
అవి నిలబడతాయా, నిలబడవా అనేది తరువాతి సంగతి.గోదావరి పుష్కరాల తొలి రోజునే రాజమండ్రిలో తొక్కిసలాట జరిగిన ఇరవైఏడు మంది చనిపోయిన ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రత్యక్ష కారకుడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇలా ఆరోపిస్తున్న పార్టీల్లో ఒకటైన కాంగ్రెసు పార్టీ ముఖ్యమంత్రి బాబుపై, సినిమా దర్శకుడు బోయపాటి శ్రీనుపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ రాజమండ్రిలోని త్రీటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రాజమండ్రిలో తొక్కిసలాటకు, ఇరవైఏడు మంది చనిపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, దర్శకుడు బోయపాటి శ్రీను కారకులని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.చంద్రబాబు, బోయపాటి కలిసి డాక్యుమెంటరీ ఫిలిం చిత్రీకరణ జరిపినందువల్లనే తొక్కిసలాట జరిగిందన్నారు.
డాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం యాత్రికులను రెండు గంటలపాటు గేట్ల అవతల ఆపేశారని, ఆ తరువాత ఒక్కసారిగా గేట్లు తీయడంతో తొక్కిసలాట జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారా, లేదా తెలియలేదు.
దుర్ఘటనకు నైతికంగా చంద్రబాబు బాధ్యుడే.తాను చాలా నీతిపరుడినని చెప్పుకునే బాబు నైతికత మాటల్లో తప్ప చేతల్లో ఉండదు.
ఆయనేమీ లాల్ బహదూర్ శాస్ర్తా కాదు కదా…! పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుంటారా? అనుమానమే.







