సూర్యాపేట జిల్లా: విద్యాశాఖలోని సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు విద్యాశాఖలో విలీనం చేయాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ సంఘం నాయకులు మాట్లాడుతూ సమగ్ర శిక్ష విభాగం విద్యాశాఖ పరిధిలో ఉండి 15 ఏళ్ల నుండి చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్నారని,తెలంగాణ రాష్ట్రంలో 22 వేల మంది కెజివిబిలలో,ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.
ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్దిక సహాయం అందకపోగా,మరణిస్తే అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక విరాళాలు సేకరించి దహన సంస్కారాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని గతంలో ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ,అధికార ప్రతినిధి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సయ్యద్, కార్యదర్శి రాంబాబు, గుగులోతు చిన్న,ఐఆర్పిలు, టుటిఐలు,ఎల్ డిలు,ఎంఎస్ లు,పిటిఐలు పాల్గొన్నారు.