సూర్యాపేట జిల్లా: విద్యుత్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పోరాటంలో అమరులైన విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు.బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో విద్యుత్ పోరాట అమరవీరుల 24వ వర్ధంతి సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరం ఆగస్టు 28న సిపిఎం,వామపక్షాల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ నిర్వహించగా హైదరాబాదు బషీర్ బాగ్ లో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాల్పులు జరిపిందని,ఈ కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిలను పొట్టనపెట్టుకున్నారని,
27 మందికి పైగా కాల్పుల్లో గాయపడి నెలలు తరబడి చికిత్స పొంది నేడు జీవిస్తున్నారని,చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుర్రాలతో తొక్కించడం, బాష్వవాయువు గోళాలు ప్రయోగించడం,రబ్బర్ బుల్లెట్లను వేయడం అనంతరం బుల్లెట్లతో కాల్చి చంపడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని,విద్యుత్తు ప్రైవేటీకరణ ఆపాలని పెద్ద ఎత్తున 100 రోజులపాటు సిపిఎం, వామపక్షాలు,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం సమరశీలంగా జరిగిందని,చివరి దశలో కాంగ్రెస్ కలిసి వచ్చి బషీర్బాగ్ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు.
నాటి నుండి దాదాపు 15 సంవత్సరాల పాటు కరెంటు చార్జీలుఏ ప్రభుత్వం పెంచలేదన్నారు.నాటి పోరాటం ఫలితంగా విద్యుత్ ప్రవేటికరణ ఆగిందన్నారు.
నేడు మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు సవరణ చట్టం 2020 తీసుకొచ్చి మొత్తం రైతులు,ప్రజల పైన విపరీతమైన భారాలు వేసేందుకు సిద్ధమైందని విమర్శించారు.
రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తారని,మీటర్లకు చార్జీలు నెలకు రైతులు 3000 నుండి 3500 వరకు చెల్లించాల్సి వస్తుందని, నేడు గృహ వినియోగదారులు,ఫ్యాక్టరీ యజమానులు, వ్యాపారస్తులకు వాణిజ్య సంస్థలకు మూడు కేటగిరీలుగా స్లాబులు పెట్టి చార్జీలు పెట్టారని,నేడు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని,ఇవి ఏమీ లేకుండా ఒకటే స్లాబు పెట్టి పెట్టుబడుదారులకు, వాణిజ్య వ్యాపారులకు, కుటుంబ వినియోగదారులకు అందరికీ ఒకటే స్లాబ్ పెట్టి దోపిడీ చేసేందుకు ప్రైవేటు సంస్థలకు విద్యుత్తును అప్పగించేందుకు సబ్ కాంట్రాక్ట్ లైసెన్సు పద్ధతి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి అధికారం లేకుండా భారాలు మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు.
నేటి వరకు విద్యుత్తు సంస్థ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉన్నదని,దీన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను ఖాతర్ చేయకుండా ఫెడరల్ వ్యవస్థకు ముప్పు తెచ్చే విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.విద్యుత్తు అమరవీరుల స్ఫూర్తితో విద్యుత్ ప్రవేటికరణకు వ్యతిరేకంగా విద్యుత్తు సవరణ చట్టాన్ని రద్దు చేసేంతవరకు పోరాటమే విద్యుత్ అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పులుసు సత్యం,జిల్లా ఉపాధ్యక్షుడు సోమపంగు జానయ్య,నారసాని వెంకటేశ్వర్లు,కడెం కుమార్,జిల్లా కమిటీ సభ్యులు వనం సోమయ్య,పులసరి వెంకట ముత్యం,గాజుగళ్ళ ముత్తయ్య,కల్లేపల్లి భాస్కర్,గుండు సైదులు, కిన్నెర వెంకన్న,జంపాల స్వరాజ్యం,కోడిఎల్లయ్య, చారి,ఎల్లయ్య,కండే భిక్షం పాల్గొన్నారు.