మన దేశానికి వచ్చే విదేశీయులు భారత సంస్కృతిని, ఆతిథ్యాన్ని ప్రశంసించడంలో ముందుంటారు.కానీ కొందరి అతి వైఖరి దేశం పేరును చెడగొట్టే పరిస్థితులు తీసుకొస్తోంది.
తాజాగా, హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.ఒక చిరు వ్యాపారి దురాశ వీడియో రూపంలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేమీ జరిగిందన్న విషయానికి వస్తే.బ్రిటన్‌కు చెందిన ఒక విదేశీయుడు హైదరాబాద్‌లో ఒక తోపుడు బండిపై ఉన్న వ్యాపారి వద్దకు వెళ్లి అరటి పండ్ల ధరను అడిగాడు.“ఒక అరటి పండు ఎంత?” అని ప్రశ్నించగా, సదరు వ్యాపారి రూ.100 అని చెప్పాడు.ఇది విన్న విదేశీయుడు ఆశ్చర్యానికి గురయ్యాడు.“ఒక పండు వంద రూపాయలా?” అని మళ్లీ ప్రశ్నించగా, వ్యాపారి అదే ధరను తేల్చి చెప్పాడు.
దానికి విదేశీయుడు తన దేశంలో వంద రూపాయిలకు (ఒక పౌండ్) ఎనిమిది అరటిపండ్లు ( Eight bananas )వస్తాయని తెలిపాడు.అంత ఎక్కువ ధరకు తాను కొనలేనని స్పష్టం చేశాడు.ఈ సంఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక ఈ సంఘటనను “ఓవర్ ప్రైస్డ్ ఇన్ ఇండియా” ( Overpriced in India )అనే శీర్షికతో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు సదరు విదేశీ వ్యక్తి.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వ్యాపారి దురాశను తీవ్రంగా విమర్శించారు.
వీడియోను చూసిన నెటిజన్లు కొందరు మార్కెట్ లో డజను అరటి పండ్ల ధర రూ.40 లేదా 50 ఉండగా, ఒక పండు రూ.100 అంటే దురాశ యొక్క పరాకాష్ట అని కామెంట్ చేస్తున్నారు.ఇలాంటి పనులు మన దేశానికి చెడ్డపేరు తెస్తాయని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తన స్వార్థ ప్రయోజనాల కోసం విదేశీయుల వద్ద అధిక ధర చెప్పడం ద్వారా ఒక వ్యక్తి దేశానికి చెడ్డ పేరు తెచ్చే పరిస్థితి ఏర్పడింది.
ఇటువంటి సంఘటనలు దేశ ఇమేజ్‌ను దెబ్బతీస్తాయని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భారతీయ సంప్రదాయాల్లో ‘అతిథి దేవో భవ’ అనే దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.
కానీ, కొందరు వ్యక్తుల దురాశ ఈ విలువలను మసకబారుస్తోంది.విదేశీయులకు అధిక ధరలు చెప్పి, వారికి అవమానకర అనుభవం కలిగించడం భారత సాంప్రదాయానికి విరుద్ధమని ప్రజలు అంటున్నారు.