నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో గత పదేళ్లుగా పేరుకుపోయిన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.అందులో భాగంగా నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఈ నెల 6 నుండి తిరుమలగిరి (సాగర్) మండలంలోని చింతలపాలెం గ్రామ శివారులో 162 సర్వే నెంబర్లో,తిమ్మాయిపాలెం గ్రామ శివారులో 39 సర్వేనెంబర్లో, తూనికినూతల గ్రామ శివారులో 45 సర్వే నెంబర్లో కాస్తు,కబ్జా ఆధారంగా భూసర్వే ప్రారంభించారు.రైతుల సమక్షంలో సర్వేయర్లు భూమిపై సర్వే నిర్వహించారు.
దీనితో గత కొన్నేళ్లుగా భూ సమస్యలు పరిష్కారం కాకుండా రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు పడిన రైతులు తమకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్లు,సర్వేయర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
అయితే ఈ సర్వే విధానాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు నవీన్ మిట్టల్ నేడు ఇక్కడి రానున్నారు.