తెలుగు మాసాలలో ఎంతో పవిత్రమైన శ్రావణమాసం ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైనది.అందుకే భక్తులు ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పరమశివుడికి ఎంతో ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఉపవాసాలు చేస్తుంటారు.
అదే విధంగా శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున మంగళగౌరి వ్రతం వరలక్ష్మీ వ్రతం చేస్తూ మహిళలు ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు.ఈ విధంగా ఉపవాసం చేసే మహిళలు శ్రావణ మాసంలో ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఆకుకూరలు: శ్రావణ మాసంలో ఆకుకూరలు తినకూడదని ఆరోగ్య పరంగాను, ఆధ్యాత్మిక పరంగాను పండితులు తెలియజేస్తున్నారు.శ్రావణ మాసంలో వర్షాలు పడటం వల్ల ఆకుకూరల పై అధిక మొత్తంలో కీటకాల ప్రభావం ఉంటుంది.
కనుక ఈ విధమైనటువంటి ఆకుకూరలను తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని శ్రావణ మాసంలో ఆకు కూరలు తినకూడదని చెబుతారు.
ఉల్లిపాయ, వెల్లుల్లి: హిందూ మతంలో సాత్విక ఆహారంగా ఉల్లిపాయ వెల్లుల్లిని పరిగణించరు.ఉల్లిపాయ, వెల్లుల్లి విష్ణుమూర్తి రాహువు, కేతువు తలను ఖండించినప్పుడు వారి గొంతు నుంచి వచ్చిన అమృతంలో నుంచి ఉద్భవించాయని చెబుతారు.రాహువు కేతువు రాక్షసులు కావడంతో వారి నుంచి ఉద్భవించిన ఉల్లిపాయ వెల్లుల్లి తీసుకోవడం వల్ల వారి ఆలోచనలు కూడా రాక్షసత్వంగానే ఉంటాయని భావిస్తారు.
అందుకోసమే ఉపవాసాలు ఉండేవారు ఉల్లిపాయ వెల్లుల్లిని తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు.

మద్యం: మద్యం ఒక తామసిక వస్తువు కనుక ఎంతో పవిత్రమైన శ్రావణమాసంలో మద్యం సేవించకూడదని పండితులు చెబుతుంటారు.మద్యం మనిషిలో ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది కనుక మద్యం సేవించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.
చేపలు: శ్రావణ మాసంలో చేపలు తినకూడదని పండితులు చెబుతుంటారు.నిజానికి శ్రావణమాసంలో చేపలు తినకూడదు అనడానికి కూడా ఒక కారణం ఉంది.చేపలు గుడ్లు పెట్టి వాటి సంపదను పెంచుకోవడానికి అనువైన మాసం శ్రావణ మాసం కనుక ఈ మాసంలో చేపలు తినకుండా ఉంటే సంపద పెరుగుతుందని భావిస్తారు.
అందుకోసమే శ్రావణ మాసంలో చేపలు తినకూడదని చెబుతారు.అదేవిధంగా మాంసాహారాన్ని కూడా ఈ మాసంలో ముట్టుకోకూడదు పండితులు చెబుతున్నారు.