మన హిందూ ధర్మంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేకమైన పాత్ర ఉంది.తరతరాలుగా భావితరాలు ధర్మబద్ధంగా నడుచుకోవడం కోసం పవిత్రమైన భగవద్గీతను బోధించాడు.
చిన్నప్పుడు అల్లరి చేష్టలతో ఎన్నో మాయలు చేసాడు.అదేవిధంగా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఎలా అధిగమించాలో పరిష్కార మార్గాన్ని కూడా మనకు భగవద్గీతలో పొందుపరిచాడు.
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన శ్రీ కృష్ణ భగవానుడు పుట్టిన రోజు 5 సంఘటనలు చోటుచేసుకున్నాయి వాటి గురించి మనం తెలుసుకుందాం…
* వాసుదేవుడు వర్షంలోనే శ్రీకృష్ణుడిని తీసుకెళ్లాడు: కంసుడు శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను బంధించి ఉన్న సమయంలో దేవకి శ్రీకృష్ణ భగవానుడికి జైలులో జన్మనిస్తుంది.ఆ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.
వాసుదేవుడు శ్రీకృష్ణుని అక్కడి నుంచి తీసుకుపోవాలని చూస్తున్న క్రమంలో జైలు తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి.ఓ చిన్న బుట్టలో వాసుదేవుడు శ్రీకృష్ణుని పెట్టుకుని జైలు నుంచి రేపల్లెకు చేరుతున్న సమయంలో తీవ్రమైన వర్షం పడింది.
ఆ వర్షంలోనే శ్రీకృష్ణుని తీసుకెళ్లి రేపల్లెలో వదిలాడు.
* యమునానది రెండుగా విడిపోయింది:
వాసుదేవుడు శ్రీకృష్ణుని జైలు నుంచి రేపల్లె కి తీసుకు వెళుతున్న సమయంలో బీభత్సమైన వర్షం ఏర్పడి యమునానది పొంగిపొర్లుతోంది.అయినప్పటికీ వాసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకెళ్తుండగా ఆ నదిలోని నీరు శ్రీకృష్ణుడు పాదాలను తగిలి రెండుగా చీలిపోయి, ఆ రెండు భాగాల మధ్య దారి ఏర్పడటంతో వాసుదేవుడు గోకులం చేరుకున్నాడు.
* వాసుదేవుడు పిల్లలని మార్చాడు:
తనకు పుట్టిన బిడ్డను కంసుడు హతమారుస్తాడు అన్న ఉద్దేశంతో ఎలాగైనా తన బిడ్డను బతికించుకోవాలనీ వాసుదేవుడు కృష్ణుడు పుట్టగానే జైలు నుంచి తీసుకువచ్చి గోకులంలో ఉన్న నందుడు ఇంటికి తీసుకు వచ్చాడు.అప్పుడే యశోద పాపకు జన్మనిచ్చింది.ఆ పాపను తీసుకెళ్లి కన్నయ్యను యశోద దగ్గర వదిలి వెళ్తాడు.
* వాసు దేవుడికి నందుడు స్వాగతం పలికాడు:
పురాణాల ప్రకారం నందుడికి తన కూతురు పుట్టినప్పుడు ఈ విషయం తెలుసు.వాసుదేవుడు కన్నయ్యని తీసుకువచ్చి తన కూతుర్ని తీసుకువెళ్తాడని తెలియడంతో తన రాకకోసం స్వాగతం పలుకుతూ తలుపులు తెరిచి ఉంటాడు.
అయితే ఈ నిజం వీరి ఇద్దరికీ తెలుసు తరువాత ఆ నిజాన్ని వీరు కూడా మర్చిపోతారు.
* వింధ్యాచల దేవి అవతరణ: నందుడు ఇంటిలో శ్రీకృష్ణుడిని వదిలిన అనంతరం కూతుర్ని తీసుకువెళ్లి మధురా నగరంలో ఉన్న కంసుని జైలుకు వాసుదేవుడు వచ్చాడు.దేవకి ఎనిమిదవ సంతానాన్ని కనిందని తెలుసుకున్న కంసుడు తనని చంపడానికి వస్తాడు.కంసుడు ఆ పాపను చంపాలని భావించిన క్షణంలో ఆ పాప ఆకాశాన్ని చేరుకుంది.అంతే కాకుండా తన దైవిక రూపాన్ని ప్రదర్శించి కంసుడికి తన చావు గురించి తెలియజేస్తుంది.తర్వాత ఆమె వింధ్యాచల పర్వతంపై ప్రతిష్టించి విశేష పూజలను అందుకుంటుంది.