మరికొద్ది రోజులలో వినాయకచవితి రానున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలకు ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు.తెలుగు వారి పండుగలలో వినాయక చవితి పండుగను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు.
ఈ క్రమంలోనే ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు వినాయక విగ్రహాలను తెచ్చుకుని పూజలు చేసి వివిధ రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి గణపయ్య ఆశీస్సులను కోరుతాము.అయితే వినాయకుడి పూజలో హంగు ఆర్భాటాల కన్నా భక్తి ఎంతో ముఖ్యమని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా వినాయక చవితి పండుగ రోజు వినాయక విగ్రహాన్ని ఏ దిశలో పెట్టాలి? ఏ విధంగా పూజించాలి? ఎన్ని రోజుల పాటు విగ్రహాన్ని ఉంచాలి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా మనం నిత్యం ఇంట్లో పూజకు ఉపయోగించే వినాయకుడు విగ్రహం ఎల్లప్పుడు ఇంటి యజమాని బొటనవేలు సైజులో మాత్రమే ఉండాలి.
ఈ విధమైనటువంటి వినాయకుడిని విగ్రహాన్ని ఇంట్లో పూజ మందిరంలో పెట్టుకొని పూజించటం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి.అలాగే వినాయకుడి వ్రతం ఆచరించే సమయంలో అర చేతి పొడవు ఉన్నటువంటి విగ్రహాలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది.
ఇక వినాయక చవితి రోజు విగ్రహాలను ఎంత ఎత్తులో ఉన్నది తెచ్చుకుంటే అదే స్థాయిలో పూజలు నిర్వహించాల్సి ఉంటుంది.ముఖ్యంగా వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకున్న వారు తూర్పు లేదా ఈశాన్యం లేదా ఉత్తరంలో ఏర్పాటు చేసుకుని, నిత్య నైవేద్యాలతో, భక్తి శ్రద్ధలతో పూజించాలి.

వినాయక చవితి రోజు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న వారు శాస్త్రం ప్రకారం విగ్రహానికి ఇంట్లో వారి పరిస్థితులకు అనుగుణంగా మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు, ఇరవై ఒకటి రోజులు ఇంట్లో పెట్టుకుని పూజలు చేయవచ్చు.వినాయక చవితి రోజు ముఖ్యంగా స్వామివారికి 21 పత్రాలతో పూజ చేస్తారు.ఇలా వినాయక చవితి పండుగ కోసం విగ్రహాలను ఏర్పాటు చేసుకున్న వారు భక్తిశ్రద్ధలతో నిత్య నైవేద్యాలతో స్వామివారిని పూజించినప్పుడే స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుంది.