నల్లగొండ జిల్లా:వేములపల్లి మండలంలో పలు గ్రామాల్లో కొందరు అక్రమార్కులు సరికొత్త ఇసుక దందాకు తెరలేపారు.స్థానిక ఎమ్మెల్యేను బద్నాం చేసే విధంగా ఇసుక ట్రాక్టర్ కు ఎమ్మేల్యే బొమ్మ వేసుకొని ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
దీనిపైరెవెన్యూ,మైనింగ్,పోలీసు అధికారులు దృష్టి సారించకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది.సంబంధిత అధికారులు కొందరు ఇసుకాసురులిచ్చే కాసులకు కక్కుర్తిపడి చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో వారి అక్రమ ఇసుక దందా మూడు టిప్పర్లు,ఆరు ట్రాక్టర్లుగా వర్ధిల్లుతుందని విమర్శలు వస్తున్నాయి.
ఇసుకకు ఆన్లైన్ అనుమతులు లేకుండా సగిస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందంటున్నారు.వేములపల్లి మండలంలోని రావులపెంట,కామేపల్లిగూడెం మూసి వాగు నుంచి ఇసుకను రాత్రి పగలు తేడా లేకుండా వందలాది ట్రాక్టర్ల ద్వారా మిర్యాలగూడెం,సూర్యాపేట, తిప్పర్తికి తరలిస్తున్నారని, మార్కెట్లో ట్రాక్టర్ ఇసుక రూ.5500 ఉండడంతో మూసీ నుండి రాత్రి వేళల్లో తోడి, డంపు చేస్తూ ఇసుక ట్రాక్టర్లు, వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఈ విషయమై స్థానికులు పోలీసులు,రెవెన్యూ శాఖలకు ఫిర్యాదు చేసినా ఎమ్మేల్యే బొమ్మను చూసి నామమాత్రపు తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకొంటున్నారని,దీంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే వారే కరువయ్యారని వాపోతున్నారు.
ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే,జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.