నల్లగొండ జిల్లా: కటకటాల కారుచీకట్లలో మగ్గుతున్న భారతీయ జైళ్ళను పరివర్తన కేంద్రాలుగా మార్చండని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా బంధువు కామ్రేడ్ జేఎస్ఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు.ఒక దేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అక్కడి కారాగారాల్లో గడిపి తీరాలని,ఖైదీల పట్ల వ్యవహరించే తీరును బట్టే ఆ దేశ గొప్పదనాన్ని అంచనా వేయచ్చునని పేర్కొన్నారు.
భిన్న కారణాలు,సామాజిక పరిస్థితులవల్ల నేరాల ఊబిలో చిక్కుకున్నవారిని సంస్కరించి సమాజంలోకి తిరిగి పంపడమే కారాగారాల ప్రధాన లక్ష్యం కావాలని,స్వతంత్ర భారతంలో జైళ్లు అలా సంస్కరణాలయాలుగా భాసించాలని అన్నారు.
కానీ,వాస్తవంలో మనదేశంలో జరుగుతున్నదేమిటి? చిన్నాచితకా నేరగాళ్లను గుండెలు తీసిన బంటులుగా తీర్చిదిద్దే నేర విద్యాలయాలుగా నేడు మన కారాగారాలు వర్ధిల్లుతున్నాయని, నూటముప్పై ఏళ్ల నాటి జైలు చట్టం,శతాబ్ద కాలం కిందటిదే అయిన ఖైదీల చట్టం,1950 లో రూపొందిన ఖైదీల బదిలీ చట్టం,కాలంచెల్లిన ఈ శాసనత్రయ పరిధిలోనే ఇప్పటికీ దేశీయంగా కారాగారాలు పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖైదీలను పట్టి బంధించడమే తప్ప సంస్కరణకు,పునరావాస కల్పనకు ప్రాధాన్యమివ్వడం లేదని, నిబంధనల సాకల్య ప్రక్షాళన ఇంకా సాకారం కావడంలేదని బాధపడ్డారు.భారతీయ జైళ్ల నిర్వహణలో సాంకేతికతను విరివిగా వినియోగించడం,ఖైదీల్లో సత్ప్రవర్తనకు పాదుగొల్పడం, నిర్బంధితులకు న్యాయసేవలు అందించడం జరగాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకున్నారు.
మన దేశంలో గల జైళ్ళు అనేవి రాష్ట్రాల పరిధిలోనివి కాబట్టి వాటి బాగోగుల బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని, లోపభూయిష్టమైన పాత చట్టాలను చెత్తబుట్టలో పడేసి,వర్తమాన అవసరాలకు అనుగుణమైన నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఖైదీల్లో సమగ్ర పరివర్తనకు పాదులు తీయాలని,నేరమయ గతాన్ని వదిలించుకొని నూతన జీవితంలోకి అడుగుపెట్టేందుకు అవసరమైన ప్రోద్బలాన్ని జైళ్లు ఖైదీలకు అందించాలని అభిప్రాయపడ్డారు.
ఉపాధి నైపుణ్యాలకు సానపట్టడం ద్వారా బయటి ప్రపంచంలో స్వశక్తితో బతకగలమన్న మానసిక స్థైరాన్ని జైళ్లు ఖైదీల్లో కల్పించాలని డిమాండ్ చేశారు.మనదేశంలోని గల వివిధ జైళ్లు, మాదకద్రవ్యాల వినియోగం నుంచి సకల ఆవలక్షణాలకూ ఆలవాలాలుగా కారాగారాలు అఘోరిస్తున్నాయని ఆరోపించారు.
చిత్రహింసల కార్ఖానాలుగానూ మనదేశ జైళ్లు పరువును మోస్తున్నాయని బాధను వ్యక్తం చేశారు.భారత్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ అవేర్నెస్ సామాజిక అధ్యయన నివేదిక ప్రకారం-దేశంలోని 1319 జైళ్లలో 4.25 లక్షల మందిని మాత్రమే నిర్బంధించగల వీలుందని, కానీ,2023 నాటికి అవి 6.54 లక్షల మందితో కిక్కిరిసిపోయాయని పేర్కొన్నారు.
జైళ్ళలో ఉన్న అత్యధికులు నేరం చేశారో లేదో నిర్ధారణ కాని విచారణ ఖైదీలని, కారాగారాల్లో మగ్గిపోతున్నవారిలో 25.2 శాతం నిరక్షరాస్యులైతే, మరో 40 శాతం పదో తరగతిలోపు చదువుకొన్నవారని,ఉచిత న్యాయసేవలు అందని ద్రాక్షలు కావడంతో ఎందరో విచారణ ఖైదీలు బెయిళ్లకు నోచుకోక వ్యధాభరితమైన జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బెయిల్ మంజూరైనా పూచీకత్తు సమర్పణకు తగిన స్థోమత లేక కటకటాల్లోనే చిక్కిశల్యమవుతున్నారని, పేర్కొన్నారు.మహిళా ఖైదీల అవస్థలైతే మరీ చెప్పనలవి కాకుండా ఉంటున్నాయన్నారు.అటు బడాబాబులకేమో కారాగారాల్లో అత్తింటి రాచమర్యాదలు అందుతున్నాయన్నారు.
కారాగారాల సంఖ్యను పెంచడం,సిబ్బంది పోస్టుల్లో ఖాళీలను భర్తీ చేయడం,వైద్య సదుపాయాలను విస్తృత పరచడం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
మానవ హక్కుల భక్షణ కేంద్రాలుగా విలసిల్లుతున్న జైళ్ల స్థితిగతుల్లో మార్పు రావాలంటే-చట్టాల సంస్కరణ త్వరితం కావాలని,నేర విచారణలు వేగం పుంజుకోవాలని సూచించారు.వ్యవస్థాగత లోపాలను పరిహరించే వైపు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీసుకునే చొరవే చీకటికొట్టాల్లో కొడిగడుతున్న అభాగ్యుల బతుకులకు కాస్తయినా సాంత్వన కలిగించాలని ప్రజా బంధువు,భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ (ఎంఎల్)సెక్రటరీ కామ్రేడ్ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.