నల్లగొండ జిల్లా:పార్టీల నేతల వాగ్భాణాలు,విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తిన ప్రచారపర్వానికి నేటితో తెరపడింది.ఇక అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది.
ఓటరు మహాశయుని చేతిలోని పాశుపతాస్త్రం లాంటి ఓటు తీర్పును నిక్షిప్తం చేసే సమయం ఆసన్నమవుతోంది.గురువారం రోజు జరగనున్న పోలింగ్‌లో మునుగోడు తదుపరి శాసనసభ్యుడిని నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోనున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 41 వేల 855 మంది ఉండగా,అందులో పురుషులు లక్షా 21 వేల 662 మంది,మహిళలు లక్షా 20 వేల 126 మంది ఉన్నారు.ఓటర్ల వర్గీకరణ చూస్తే అత్యధికంగా 31 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారున్నారు.31 నుంచి 40 ఏళ్ల మధ్య 64 వేల 721 మంది ఉండగా, 41 నుంచి 50 ఏళ్ల మధ్యలో 47,430 ఓటర్లున్నారు.51 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు వారు 32,120 మంది,26 నుంచి 30 ఏళ్ల మధ్యలో 28,204 మంది ఓటర్లు ఉన్నారు.20,472 మంది 22 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు వారు కాగా,61 నుంచి 70 ఏళ్ల మధ్య 19,655 మంది ఉన్నారు.ఓటర్ల జాబితాలో దివ్యాంగులు 5,686 మంది ఉన్నారు.80 ఏళ్లు పైబడినవారికి,దివ్యాంగులకు ఈసీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించింది.798 మంది ఈ సదుపాయాన్ని ఎంచుకోగా అందులో 685 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.పోటీలో 47 మంది అభ్యర్థులు నిలవగా, 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
ఉపఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు,నోటా కలిపి ఒక్కో ఈవీఎంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం.ఇందుకోసం 1,192 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేశారు.కంట్రోల్ యూనిట్లు,వీవీప్యాట్లను 596 చొప్పున అందుబాటులో ఉంచారు.పోలింగ్ కేంద్రాల వారీగా ఉండే అవసరాలతో పాటు 10 శాతం అదనంగా సిద్ధం చేసి ఉంచారు.